కొడుకు తప్పు చేస్తే.. తండ్రిని శిక్షించాలా?
హిస్సార్ (హరియాణ): తన కొడుకు ఓ యువతిని వెంటాడి వేధించిన కేసులో విపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న బీజేపీ హరియాణ చీఫ్ సుభాష్ బరాలాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అండగా నిలిచారు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
'ఈ కేసు గురించి నాకు తెలిసింది. చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నా. ఇది సుభాష్ బారాలకు సంబంధించిన విషయం కాదు. ఒక వ్యక్తికి సంబంధించింది. ఆయన కొడుకుకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటాం' అని సీఎం విలేకరులతో తెలిపారు.
యువతిపై వేధింపుల కేసులో సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లో ఓ యువతి శుక్రవారం రాత్రి కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్‌యూవీ వాహనంలో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె ఏ మాత్రం భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ చీఫ్ సుభాష్ బరాలాపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.