'నా క్యారెక్టర్ ఎవ్వరూ వేలెత్తి చూపలేరు'
పంచ్‌కులా(హరియాణా): తనపై జరుగుతున్న రాజకీయ దాడులకు వర్ణికా కుందూ మరోసారి గట్టిగా బదులిచ్చారు. తన వ్యక్తిత్వం గురించి వేలేత్తి చూపే అర్హత ఏ ఒక్కరికీ లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను ఏ సమయంలో ఎక్కడికి వెళ్లానేది ఏ ఒక్కరికీ సంబంధించింది కాదు. ఈ విషయాన్ని బట్టే ఓ మహిళ వ్యక్తిత్వం నిర్ణయించలేరు. ఇలాంటి పనులే ఒకబ్బాయి చేస్తున్నప్పుడు అతడిని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. అబ్బాయిలు చేసే పనులే అమ్మాయిలు చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు వేధిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మహిళలు బాహాటంగా వ్యతిరేకించాల్సిందే' అని ఆమె అన్నారు.
మరోపక్క, సోషల్ మీడియాలో ఆమెను కించపరుస్తూ వస్తున్న వీడియోలు, ఫొటోలు, వ్యతిరేక ప్రచారంపై స్పందిస్తూ ఇలాంటి వాటికి తాను భయపడతానని, తన క్యారెక్టర్‌ను దిగజార్చినట్లవుతుందనుకోవడం పొరపాటని అన్నారు. ఒక వేళ ఎవరైనా అలాంటి పోస్టింగులు చేస్తే అది వారి వ్యక్తిత్వాన్ని బయటపెట్టినట్లవుతుందే తప్ప తనది కాదన్నారు. రాత్రి కారులో వెళుతున్న వర్ణికా కుందును హరియాణా బీజేపీ చీఫ్ సుబాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా అతడి స్నేహితుడు వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, అర్థరాత్రి పూట ఆమెకు అసలు ఏం పని అని, ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్లిందంటూ కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు.