చండీగఢ్ వీధుల్లో వర్ణికా కుందుకు ఎదురైన అనుభవమే గుర్గావ్‌లో ఓ యువతికి ఎదురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుర్గావ్: చండీగర్ వీధుల్లో వర్ణికా కుందుకు ఎదురైన అనుభవమే గుర్గావ్‌లో ఓ యువతికి ఎదురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఓ యువతి(25) విధులను ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగలు కారులో ఆమెను వెంటాడారు. మూడు కిలోమీటర్ల మేర యువతిని అనుసరించినవాళ్లు ఆమె వాహనాన్ని ఆపాల్సిందిగా కేకలు వేశారు. దుండగులు వెంబడిస్తున్నట్టు గమనించిన బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తనను వెంబడించిన కారు నెంబర్ ఆమెకు గుర్తురాలేదు.
కేవలం హెచ్‌ఆర్-57 అనే నెంబర్లు మాత్రమే యువతి చెప్పగలుగుతున్నదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ కమీషనర్ సందీప్ కిర్వార్ కార్యాలాయానికి వెళ్లిన బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయితే తప్ప దర్యాప్తులో తాము పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొనడం గమనార్హం. చండీగఢ్‌లో వర్ణికా కుందు అనే యువతిని హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా తన ఎస్‌యూవీలో వెంటాడి వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో గుర్‌గావ్‌లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.