Varnika Kundu
-
గుర్గావ్లోనూ యువతిని వెంటాడారు..
గుర్గావ్: చండీగర్ వీధుల్లో వర్ణికా కుందుకు ఎదురైన అనుభవమే గుర్గావ్లో ఓ యువతికి ఎదురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఓ యువతి(25) విధులను ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగలు కారులో ఆమెను వెంటాడారు. మూడు కిలోమీటర్ల మేర యువతిని అనుసరించినవాళ్లు ఆమె వాహనాన్ని ఆపాల్సిందిగా కేకలు వేశారు. దుండగులు వెంబడిస్తున్నట్టు గమనించిన బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తనను వెంబడించిన కారు నెంబర్ ఆమెకు గుర్తురాలేదు. కేవలం హెచ్ఆర్-57 అనే నెంబర్లు మాత్రమే యువతి చెప్పగలుగుతున్నదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ కమీషనర్ సందీప్ కిర్వార్ కార్యాలాయానికి వెళ్లిన బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయితే తప్ప దర్యాప్తులో తాము పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొనడం గమనార్హం. చండీగఢ్‌లో వర్ణికా కుందు అనే యువతిని హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా తన ఎస్‌యూవీలో వెంటాడి వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో గుర్గావ్లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. -
రాత్రివేళల్లో అబ్బాయిలకేం పని: నటి
చండీగఢ్: హర్యాణాలో ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుందును రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా వేధించిన ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదని అబ్బాయిలనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసుతో రాజకీయాలకు ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అమ్మాయిలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని రాత్రివేళల్లో బయటికి పంపకూడదని.. అయినా రాత్రివేళల్లో రోడ్లపై వారికి ఏం పని ఉందన్న మరో బీజేపీ ఎంపీ రాంవీర్ భట్టి వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓ యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.. ఆయనకు నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. 'కేవలం రాత్రివేళల్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది. పగలు ఈ దుర్మార్గాలు తక్కువన్న విషయం పక్కనపెడితే.. రాత్రివేళల్లో బయటకు రాకుండా ఉండాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. యువకులకు రాత్రిపూట రోడ్లపై ఏం పని ఉంది. వారిని ఆ సమయంలో ఇంట్లో కూర్చోపెడితే ఈ సమస్యలే తలెత్తవని' ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను చండీగఢ్‌లో లేనని, తాను ఎంపీని మాత్రమేనని, డీఐజీనో.. గవర్నర్‌నో కాదన్నారు. కానీ ప్రతి వివాదంలోనూ నేత మనీశ్ తివారీ తనను లాగుతున్నారని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న లుథార బాధితురాలికి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు. కేసును నీరుగార్చే యత్నాలు జరగలేడం లేదని కిరణ్ ఖేర్ వివరించారు. -
వికాస్ అరెస్ట్.. 'నా కొడుకైనా శిక్ష పడాల్సిందే'
చండీగఢ్ : ఎట్టకేలకు వేధింపుల కేసులో హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలాను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26 పోలీస్ స్టేషన్లో అతడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే 11గంటలకు అతడు స్టేషన్‌కు హాజరుకావాలని సమన్లు ఇచ్చినప్పటికీ దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా చివరకు పోలీసుల ముందుకు రావడంతో అతడిని అరెస్టు చేశారు. దీంతో ఐదు రోజులపాటు సాగిన ఉత్కంఠ ఇక విచారణ దశకు చేరింది. వికాస్ స్టేషన్‌కు రావడానికి ముందే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తండ్రి సుభాష్ బరాలా తన కుమారుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. అతడు మార్గం మద్యలో ఉన్నాడని వివరించారు. 'నేరస్తులను తప్పనిసరిగా శిక్షించాలి.. అది నా కుమారుడైనా సరే. ఆ అమ్మాయి నా కూతురితో సమానం. విచారణకు వెళ్లాల్సిందేనని నేను చాలా స్పష్టంగా మా వాడికి చెప్పాను' అని చెప్పారు. మరోపక్క, పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ వికాస్ నేరం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అతడిని అరెస్టు చేసేందుకు సరిపోతాయని అన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పేందుకు వికాస్ సిద్ధంగా ఉన్నాడట. కావాలని ఆ రోజు వెంబడించలేదని డ్రైవింగ్ చేసే వ్యక్తి పురుషుడా, యువతినా అనే విషయంపై బెట్ కాయడం వల్లే అది తెలుసుకునేందుకు కారును అనుసరించినట్లు చెప్పాడని సమాచారం. వికాస్ బరాలా, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు అయిన వర్ణికా కుందును కారులో వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు పెను ధుమారాన్ని రేపింది. -
'నా క్యారెక్టర్ ఎవ్వరూ వేలెత్తి చూపలేరు'
పంచ్‌కులా(హరియాణా): తనపై జరుగుతున్న రాజకీయ దాడులకు వర్ణికా కుందూ మరోసారి గట్టిగా బదులిచ్చారు. తన వ్యక్తిత్వం గురించి వేలేత్తి చూపే అర్హత ఏ ఒక్కరికీ లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను ఏ సమయంలో ఎక్కడికి వెళ్లానేది ఏ ఒక్కరికీ సంబంధించింది కాదు. ఈ విషయాన్ని బట్టే ఓ మహిళ వ్యక్తిత్వం నిర్ణయించలేరు. ఇలాంటి పనులే ఒకబ్బాయి చేస్తున్నప్పుడు అతడిని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. అబ్బాయిలు చేసే పనులే అమ్మాయిలు చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు వేధిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మహిళలు బాహాటంగా వ్యతిరేకించాల్సిందే' అని ఆమె అన్నారు. మరోపక్క, సోషల్ మీడియాలో ఆమెను కించపరుస్తూ వస్తున్న వీడియోలు, ఫొటోలు, వ్యతిరేక ప్రచారంపై స్పందిస్తూ ఇలాంటి వాటికి తాను భయపడతానని, తన క్యారెక్టర్‌ను దిగజార్చినట్లవుతుందనుకోవడం పొరపాటని అన్నారు. ఒక వేళ ఎవరైనా అలాంటి పోస్టింగులు చేస్తే అది వారి వ్యక్తిత్వాన్ని బయటపెట్టినట్లవుతుందే తప్ప తనది కాదన్నారు. రాత్రి కారులో వెళుతున్న వర్ణికా కుందును హరియాణా బీజేపీ చీఫ్ సుబాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా అతడి స్నేహితుడు వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, అర్థరాత్రి పూట ఆమెకు అసలు ఏం పని అని, ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్లిందంటూ కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు. -
వర్ణికా నా కూతురులాంటిది: సుభాష్ బరాలా
చంఢీఘర్: యువతిని వెంటాడి, వేధించిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వికాస్ బరాలా తండ్రి, హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా ఎట్టకేలకు మౌనం వీడారు. బాధితురాలు వర్ణికా కుందూ తన కుమార్తె లాంటిదని, ఈ కేసులో తాను లేదా తమ పార్టీ బీజేపీ జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. సుభాష్ బరాలా కుమారుడు 23 ఏళ్ల వికాస్ శుక్రవారం రాత్రి సీనియర్ ఐఏఎస్ అధికారి వీరేంద్ర కుందూ కుమార్తె వర్ణికా ప్రయాణిస్తున్న కారును తన ఎస్‌యూవీతో వెంటాడి, అడ్డగించిన విషయం విదితమే. ఈ కేసులో వికాస్, అతని స్నేహితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. వీరిపై కిడ్నాప్ అభియోగాలను మోపకపోవడం పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన చోటుచేసుకున్న ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులు ప్రకటించడం పైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ కేసులో ఇప్పటివరకూ తాను, తమ పార్టీ బీజేపీ నుంచి పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లూ తేలేదని, ఇక ముందు కూడా రాజకీయ జోక్యం ఉండదని సుభాష్ బరాలా చెప్పారు. చట్టబద్ధంగా విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బరాలాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన రాజీనామా చేయబోరని బీజేపీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
'అర్థరాత్రి వెళితే నీకెందుకు.. అది నాపని'
చండీగఢ్: అర్ధరాత్రి ఆమె ఎందుకు బయటకు వెళ్లిందంటూ హరియాణా బీజేపీ చీఫ్ కుమారుడు, అతడి స్నేహితుడి చేతిలో వేధింపులు ఎదుర్కొన్న వర్ణికా కుందుపై వ్యాఖ్యలు చేసిన హరియాణా బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్‌వీర్ భట్టిపై వర్ణికా తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు వెళ్లాననేది ప్రశ్నించడానికి ఆయన ఎవరు అంటూ ధ్వజమెత్తారు. అలా ప్రశ్నించడం ఆయన పనికాదని, అది తన వ్యక్తిగతం, తన కుటుంబానికి సంబంధించిన విషయం అని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలనేది తన వ్యవహారం అంటూ గట్టిగా బదులిచ్చారు. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు వర్ణికా కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో తరిమారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దాదాపు 8 జంక్షన్ల వరకు ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ విషయం పెద్ద దుమారం రేగడంతో ఆమెకు అర్ధరాత్రి ఏం పనంటూ పుండుమీద కారంజల్లినట్లుగా బీజేపీ నేత మాట్లాడారు. దీంతో వర్ణికా సోమవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'అది ఆయన పని కాదు.. ఎక్కడ, ఏం చేయాలనేది నాకు సంబంధించిన విషయం నా కుటుంబానికి సంబంధించిన విషయం. రాత్రి పూట అలా జరిగితే అది నా తప్పా? రాత్రి పూట పురుషులు నియంత్రణలో ఉండరా? నన్నెందుకు అస్సలు ప్రశ్నిస్తున్నారు? నేను దాడికి గురైన బాధితురాలిని వారు నన్ను ప్రశ్నించకూడదు? ఇప్పుడు నన్ను నేను రక్షించుకున్నాను కాబట్టి ఏదో తప్పయి ఉంటుంది క్షమించండి అని అంటున్నారు. నిజానికి నాకు ఏదైనా అయి ఉంటే ఎవరికి వారు క్షమాపణలు చెబుతారు? అసలు వీరు సమాజాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఒంటిరిగా మహిళ కనిపించకూడదా? ఒంటరిగా ఉన్న మహిళ మద్యం సేవించకూడదా? రాత్రి ఒక మహిళ తన స్నేహితులైన అబ్బాయిలతో ఉండి మత్తులో ఉంటే ఇక ఆమె తనపై లైంగిక వేధింపులకు ఆహ్వానించినట్లా? అంటూ దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో కడిగి పారేశారు. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో మద్దతు స్వరం వినిపిస్తోంది.