వర్ణికా నా కూతురులాంటిది: సుభాష్ బరాలా
చంఢీఘర్: యువతిని వెంటాడి, వేధించిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వికాస్ బరాలా తండ్రి, హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా ఎట్టకేలకు మౌనం వీడారు. బాధితురాలు వర్ణికా కుందూ తన కుమార్తె లాంటిదని, ఈ కేసులో తాను లేదా తమ పార్టీ బీజేపీ జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. సుభాష్ బరాలా కుమారుడు 23 ఏళ్ల వికాస్ శుక్రవారం రాత్రి సీనియర్ ఐఏఎస్ అధికారి వీరేంద్ర కుందూ కుమార్తె వర్ణికా ప్రయాణిస్తున్న కారును తన ఎస్‌యూవీతో వెంటాడి, అడ్డగించిన విషయం విదితమే. ఈ కేసులో వికాస్, అతని స్నేహితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. వీరిపై కిడ్నాప్ అభియోగాలను మోపకపోవడం పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఘటన చోటుచేసుకున్న ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులు ప్రకటించడం పైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ కేసులో ఇప్పటివరకూ తాను, తమ పార్టీ బీజేపీ నుంచి పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లూ తేలేదని, ఇక ముందు కూడా రాజకీయ జోక్యం ఉండదని సుభాష్ బరాలా చెప్పారు. చట్టబద్ధంగా విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బరాలాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన రాజీనామా చేయబోరని బీజేపీ పేర్కొన్న విషయం తెలిసిందే.