'అర్థరాత్రి వెళితే నీకెందుకు.. అది నాపని'
చండీగఢ్: అర్ధరాత్రి ఆమె ఎందుకు బయటకు వెళ్లిందంటూ హరియాణా బీజేపీ చీఫ్ కుమారుడు, అతడి స్నేహితుడి చేతిలో వేధింపులు ఎదుర్కొన్న వర్ణికా కుందుపై వ్యాఖ్యలు చేసిన హరియాణా బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్‌వీర్ భట్టిపై వర్ణికా తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు వెళ్లాననేది ప్రశ్నించడానికి ఆయన ఎవరు అంటూ ధ్వజమెత్తారు. అలా ప్రశ్నించడం ఆయన పనికాదని, అది తన వ్యక్తిగతం, తన కుటుంబానికి సంబంధించిన విషయం అని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలనేది తన వ్యవహారం అంటూ గట్టిగా బదులిచ్చారు. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు వర్ణికా కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్‌యూవీ వాహనంలో తరిమారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు.
దాదాపు 8 జంక్షన్ల వరకు ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ విషయం పెద్ద దుమారం రేగడంతో ఆమెకు అర్ధరాత్రి ఏం పనంటూ పుండుమీద కారంజల్లినట్లుగా బీజేపీ నేత మాట్లాడారు. దీంతో వర్ణికా సోమవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'అది ఆయన పని కాదు.. ఎక్కడ, ఏం చేయాలనేది నాకు సంబంధించిన విషయం నా కుటుంబానికి సంబంధించిన విషయం. రాత్రి పూట అలా జరిగితే అది నా తప్పా? రాత్రి పూట పురుషులు నియంత్రణలో ఉండరా? నన్నెందుకు అస్సలు ప్రశ్నిస్తున్నారు? నేను దాడికి గురైన బాధితురాలిని వారు నన్ను ప్రశ్నించకూడదు? ఇప్పుడు నన్ను నేను రక్షించుకున్నాను కాబట్టి ఏదో తప్పయి ఉంటుంది క్షమించండి అని అంటున్నారు.
నిజానికి నాకు ఏదైనా అయి ఉంటే ఎవరికి వారు క్షమాపణలు చెబుతారు? అసలు వీరు సమాజాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఒంటిరిగా మహిళ కనిపించకూడదా? ఒంటరిగా ఉన్న మహిళ మద్యం సేవించకూడదా? రాత్రి ఒక మహిళ తన స్నేహితులైన అబ్బాయిలతో ఉండి మత్తులో ఉంటే ఇక ఆమె తనపై లైంగిక వేధింపులకు ఆహ్వానించినట్లా? అంటూ దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో కడిగి పారేశారు. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో మద్దతు స్వరం వినిపిస్తోంది.