
వికాస్ అరెస్ట్.. 'నా కొడుకైనా శిక్ష పడాల్సిందే'
చండీగఢ్ : ఎట్టకేలకు వేధింపుల కేసులో హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలాను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26 పోలీస్ స్టేషన్‌లో అతడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే 11గంటలకు అతడు స్టేషన్‌కు హాజరుకావాలని సమన్లు ఇచ్చినప్పటికీ దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా చివరకు పోలీసుల ముందుకు రావడంతో అతడిని అరెస్టు చేశారు. దీంతో ఐదు రోజులపాటు సాగిన ఉత్కంఠ ఇక విచారణ దశకు చేరింది.
వికాస్ స్టేషన్‌కు రావడానికి ముందే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తండ్రి సుభాష్ బరాలా తన కుమారుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. అతడు మార్గం మద్యలో ఉన్నాడని వివరించారు. 'నేరస్తులను తప్పనిసరిగా శిక్షించాలి.. అది నా కుమారుడైనా సరే. ఆ అమ్మాయి నా కూతురితో సమానం. విచారణకు వెళ్లాల్సిందేనని నేను చాలా స్పష్టంగా మా వాడికి చెప్పాను' అని చెప్పారు. మరోపక్క, పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ వికాస్ నేరం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అతడిని అరెస్టు చేసేందుకు సరిపోతాయని అన్నారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పేందుకు వికాస్ సిద్ధంగా ఉన్నాడట. కావాలని ఆ రోజు వెంబడించలేదని డ్రైవింగ్ చేసే వ్యక్తి పురుషుడా, యువతినా అనే విషయంపై బెట్ కాయడం వల్లే అది తెలుసుకునేందుకు కారును అనుసరించినట్లు చెప్పాడని సమాచారం. వికాస్ బరాలా, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు అయిన వర్ణికా కుందును కారులో వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు పెను ధుమారాన్ని రేపింది.