వేధింపుల కేసు: షాకిచ్చిన వికాస్
- యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ
- నోటీసులు కూడా తీసుకోని నిందితుడు
ఛంఢీగడ్: యువతిని వెంటాడి వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హరియాణా బీజేపీ చీఫ్ తనయుడు వికాస్ బరాలా పోలీసులకు షాకిచ్చాడు. విచారణలో భాగంగా వెళ్లిన అధికారులకు రక్త, మూత్ర నమునాలు ఇచ్చేందుకు నిరాకరించాడు.
నిందితులిద్దరూ న్యాయ విద్యార్థులు, పైగా చట్టాల అవగాహన ఉండటంతో అందుకు నిరాకరించారని డీజీపీ లుథారా మీడియాకు తెలిపారు. కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరు ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలించాం. అందులో యువతిని నిందితులు వెంబడించినట్లు స్పష్టమయ్యింది. అదనపు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. విచారణను వేగవంతం చేశామని, త్వరగతిన బాధితురాలికి న్యాయం చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు నిందితులు వికాస్ బరాలా మరియు అశిశ్ కుమార్ లను బుధవారం ఉదయం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే వికాస్ మాత్రం నోటీసులు అందుకునేందుకు నిరాకరించటంతో ఇంటి గేటుకు అంటించారు. మొత్తం వ్యవహారంపై స్పందించిన వికాస్ తండ్రి, హరియానా బీజేపీ చీఫ్ సుభాష్బరాలా.. బాధిత యువతి వర్ణికా కుంద్రా తన కూతురులాంటిదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విచారణ పారదర్శకంగా జరిగేందుకు సహకరిస్తానని, తనవైపు నుంచి ఎలాంటి (అధికార) ఒత్తిళ్లు ఉండబోవని స్పష్టం చేశారు కూడా. వేధింపులతోపాటు ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద వికాస్ పై కేసులు నమోదు అయ్యాయి.