కేసును నీరుగార్చేందుకే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహిళను వేధించిన కేసులో హరియాణా బీజేపీ చీఫ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ తీరును కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. సీసీటీవీ కెమేరాలు పనిచేయడం లేదని చెబుతూ సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులు ప్రకటించడం కుట్రపూరితమని ఆ పార్టీ ప్రతినిధి, హర్యానా కాంగ్రెస్ నేత రూపేంద్ర సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. బీజేపీ చీఫ్ సుభాష్ బరాలను, ఆయన కుమారుడు వికాస్ బరాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం హర్యానా ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కైందని అన్నారు. పోలీసులు చెబుతున్న విధంగా ఏడు సీసీ టీవీ కెమెరాల్లో ఐదు పనిచేయకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
అకస్మాత్తుగా అవి ఎందుకు పనిచేయలేదు..? కీలకమైన సాక్ష్యాన్ని నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చారని సందేహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి కుమార్తెను బరాల అతని స్నేహితుడు మద్యం మత్తులో వెంటాడిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్ట్ అయిన వీరిద్దరూ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.