రతన్గడ్ ఘటనలో కలెక్టర్, ఎస్పీ సహా 19 మంది సస్పెన్షన్
రతన్గడ్ దేవాలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగి 117 మంది మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. అ ఘటనకు బాధ్యులు భావిస్తూ దతియా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతోపాటు మరో 19 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వచ్చే నెల 25 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వారందరిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సస్పెన్షన్ చేశారు.
అలాగే ఆ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేపట్టిన విచారణ మంగళవారం నుండి ప్రారంభం అవుతుందని సోమవారం సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేస్తారని తెలిపారు. తొక్కిసలాటకు ముందు భక్తులతో, ఘటన అనంతరం మృతదేహలతో పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అన్ని అంశాలపై జడ్జి విచారణ జరిపి నివేదిక అందజేస్తారని వెల్లడించారు.
అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని రతన్గడ్ దేవాలయం సమీపంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 117 మంది మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.