చేతబడులు, ఇతర మూఢనమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు చేసింది.
చేతబడులు, ఇతర మూఢనమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు చేసింది. ఈ ఆర్డినెన్సుపై గవర్నర్ కె.శంకర నారాయణన్ శనివారం సాయంత్రం సంతకం చేశారు. దీంతో ఇది వెంటనే అమలులోకి వచ్చినట్లయింది. ఇకపై చేతబడులు చేయడం లాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తారు.
దేశంలోనే ఇలాంటి ఆర్డినెన్సు తెచ్చిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. త్వరలోనే దీనికి చట్టరూపం కూడా తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని ప్రకారం మూఢనమ్మకాలతో చేతబడి, బాణామతి లాంటివి చేస్తే వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ప్రముఖ హేతువాది, ఉద్యకర్త నరేంద్ర దభోల్కర్ ఈ తరహా చట్టం కోసం జీవితాంతం పోరాడారు. గత వారం ఆయనను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మహారాష్ట్ర సర్కారు నష్టనివారణ చర్యగా ఈ చట్టం చేసినట్లు చెబుతున్నారు. బుధవారం నాడు రాష్ట్ర మంత్రి వర్గం ఈ ఆర్డినెన్సును రూపొందించి పంపగా, శనివారం సాయంత్రం గవర్నర్ దానిపై సంతకం చేశారు.