
మ్యాగీపై మహారాష్ట్ర, పంజాబ్ వేటు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై శనివారం మరో రెండు రాష్ట్రాలు నిషేధం విధించాయి. మహారాష్ట్ర, పంజాబ్‌లలోని మ్యాగీ శాంపిళ్లలో ప్రమాణాలు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల మేరకు లేవని తేలడంతో ఆ రాష్ట్రాలూ నిషేధించాయి. ముంబైలో 6 శాంపిళ్లను పరీక్షించగా, మూడు శాంపిళ్లలో సీసం గరిష్ట పరిమితి(2.5 పీపీఎం) కంటే ఎక్కువగా 4.66 పీపీఎం ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.
పంజాబ్‌లో పరీక్షించిన శాంపిళ్లలో సీసం అనుమతించిన పరిమితిలోనే ఉందని, మోనోసోడియం గ్లుటామేట్ మాత్రం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఆ రాష్ట్ర అధికారులు అన్నారు. అయితే, ఆయా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పనిచేసిన ప్రముఖులపై ప్రస్తుతం చర్యలు తీసుకోబోవడం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. మరోవైపు ఇతర బ్రాండ్ల ఇన్‌స్టంట్ నూడుల్స్‌నూ పరీక్షించనున్నట్లు తెలిపింది.
ఆహార భద్రత కోసం వివిధ బ్రాండ్ల పాస్తాను కూడా పరీక్షిస్తామంది. కాగా, నెస్లే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మ్యాగీతో సహా 9 రకాల ఉత్పత్తులన్నింటి తయారీ, విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ శుక్రవారం నిషేధం విధించడం తెలిసిందే. ఈ నూడుల్స్‌ను ఢిల్లీ, అస్సాం, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదివరకే నిషేధించాయి.