నీటితో మంట.. వెల్డింగ్!
మంటలు ఆర్పేందుకు ఏం కావాలి? నీళ్లుంటే సరిపోతుంది. మరి మంట పుట్టించాలంటే... వంటచెరకు మొదలుకొని అనేక పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ... యూరప్‌కు చెందిన ఓ పరిశోధక బృందం మాత్రం తాము నీళ్లతోనే మంటలు సృష్టిస్తామని, తద్వారా వేర్వేరు పరిశ్రమల్లో జరిగే వెల్డింగ్ పనులకయ్యే ఖర్చు తగ్గిస్తామని అంటోంది. అనడమే కాదు.. ఓ నమూనా యంత్రాన్ని తయారు చేసి వెల్డింగ్ పనులు చేసే వారికి పంపిణీ చేసి పరీక్షిస్తోంది కూడా. నీళ్లతో మంటలేమిటబ్బా అన్న సందేహం వద్దు. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్, ఆక్సిజన్‌లు కలిస్తేనే నీరవుతుందని మనకు తెలుసు. కాకపోతే నీటిలోని ఈ రెండు మూలకాలను వేరు చేసి వా డుకోవడంలోనే ఇబ్బందులున్నాయి.
ఎలక్ట్రోలైజేషన్ అన్న ప్రక్రియ ప్లాటినమ్ వంటి ఖరీదైన పదార్థాలను వాడుతుంది. యూరోపియన్ పరిశోధక బృందం మాత్రం ఖరీదైన పదార్థాలకు ప్రత్యామ్నాయాలు గుర్తించింది. ఫలితంగా కరెంట్ సాయంతో నడిచే పోర్టబుల్ ఎలక్ట్రొలైజర్ పరికరం ‘సేఫ్ ఫ్లేమ్’ పుట్టింది. సంప్రదాయ వెల్డింగ్‌లో వాడే అసిటలీన్, ప్రొపేన్ వంటి వాటితో పోలిస్తే సేఫ్‌ఫ్లేమ్ దాదాపు 20 రెట్లు చౌక మాత్రమే కాకుండా చాలా సురక్షితమైందని పరిశోధకులు అంటున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్‌లు రెండూ ఎలక్ట్రోలైజర్ గొట్టం చిట్టచివరి భాగంలో మాత్రమే కలిసి మంట పుట్టిస్తాయి కాబట్టి... దీన్ని వాడటమూ సులువేనన్నది వీరి అంచనా.