మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం
మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దక్షిణ చైనా సముద్రం మీదుగా ఆ విమానం మలుపు తీసుకుందని, సరిగ్గా ఆ తర్వాతే అది బాగా కిందకు పడిపోయిందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా కొత్తగా తెలిసింది. రాడార్ పరిధి నుంచి అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించింది. విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని, అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. విమానం నుంచి ఎలాంటి ప్రమాద సంకేతాలు రాలేదని అధికారులు అంటున్నా.. అప్పటికే కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలం కావడంతో ఆ సంకేతాలు అందకపోయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
విమానం మలుపు తీసుకున్న ప్రాంతంలో విమాన ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుందని, బహుశా అక్కడ ట్రాఫిక్ కారణంగానే విమానం తక్కువ ఎత్తులో ప్రయాణించి ఉండొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. చిట్టచివరిగా విమానం నుంచి సంకేతం అందేసరికి అది బీజింగ్ వైపు వెళ్తున్నట్లు మలేషియన్ అధికారులు చెప్పారు. అంటే అది హైజాక్ అవ్వడం లేదా దారి మళ్లడం లాంటిది ఏమీ లేదని అర్థమవుతోంది. కొత్తగా వచ్చిన వివరాల వల్ల విమానంలో ఏం జరిగి ఉండొచ్చని కొంత అంచనా అయితే వస్తోంది గానీ, విమానం ఎలా తప్పిపోయిందో మాత్రం ఇంకా తెలియట్లేదు. విమానం తప్పిపోయిన రోజున దాన్ని మిలటరీ రాడార్ తెల్లవారుజామున 1.19 నుంచి 2.40 గంటల మధ్య ట్రాక్ చేస్తూనే ఉందని, అయితే 12వేల అడుగుల కంటే తక్కువ ఎత్తుకు ఎప్పుడు పడిపోయిందో మాత్రం తెలియలేదని చెబుతున్నారు.