బహిరంగ మూత్రవిసర్జన వద్దన్నందుకు..
ఢిల్లీ: దేశరాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తాము భోజనం చేసే చోట.. మూత్రవిసర్జన చేస్తోన్నయువకులను అడ్డుకున్న ఓ వ్యక్తి.. చివరికి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై ఈ ఘాతుకానికి పాల్పడిన యువకులు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులుగా అనుమానిస్తున్నారు. వాయువ్య ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ మిలింద్ దంబ్రే చెప్పిన వివరాలిలాఉన్నాయి..
స్థానిక జీటీబీ నగర్‌కు చెందిన రవీందర్ కుమార్(33) ఈ-రిక్షా డ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం జీబీటీ నగర్ మెట్రో స్టేషన్ ముందున్న పార్కింగ్‌లో ఆటోను నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తుండగా.. పార్కింగ్ గోడ పక్కనే చేతిలో బీర్ క్యాన్లున్న ఇద్దరు యువకులు మూత్రవిసర్జన చేస్తుండటం కనిపించింది. అది.. ఆటో డ్రైవర్లు భోజనానికి కూర్చునే చోటు కావడంతో రవీందర్ పరుగున వెళ్లి వాళ్లను అడ్డుకున్నాడు. పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడు. ‘కావాలంటే నా దగ్గర చిల్లరుంది. ఇవి తీసుకుని టాయిటెల్‌లోకి వెళ్లండి..’ అని అన్నాడు. రవీందర్ మాటలతో రెచ్చిపోయిన యువకులు అతనితో గొడవపెట్టుకుని, తీవ్రంగా హెచ్చరించి వెళ్లిపోయిన యువకులు.. తిరిగి సాయంత్రం 4 గంటలకు 30 మంది స్నేహితులతో కలిసి ఆటోస్టాండ్‌కు వచ్చారు..
ఆకుపచ్చ చొక్కా వేసుకున్న రవీందర్ అక్కడ కనిపించకపోవడంతో దాదాపు నాలుగు గంటలు నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో రవీందర్ ఆటో స్టాండ్‌లోకి రాగానే చుట్టుముట్టి దాడిచేశారు. ఇనుపరాడ్లు, ఇటుకలు, రాళ్లతో దారుణంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఇతర డ్రైవర్లను బెదిరించారు. చివరికి రవీందర్ కిందపడిపోవడంతో యువకులు అక్కడినుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రవీందర్ కుటుంబసభ్యులు అతన్ని ముందుగా ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అతను కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తేల్చారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రవీందర్‌ను చావబాదింది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులే అయిఉంటారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
బహిరంగ మూత్రవిర్జన నేరం కాదు, కానీ..
బస్లాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, మైదానాల్లాంటి బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడాన్ని నేరంగా పరిగణించారు. కానీ సమాజానిక నియమంగా భావిస్తారు. పబ్లిక్ టాయిటెల్లు అందుబాటులో ఉండికూడా బహిరంగంగా మలమూత్రాలను విసర్జించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. దాని ద్వారా ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే క్లీన్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున టాయిలెట్లను నిర్మిస్తోంది. రవీందర్ మరణవార్తపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.