
తల నరికి.. నడిరోడ్డుపై విసిరేశారు
తన అల్లుడి హత్యకు ప్రతీకారంగా.. ఓ వ్యక్తిని నడిరోడ్డులో అతడి భార్య కళ్లెదుటే తల నరికి చంపించడమే కాక, ఆ తలను రోడ్డుమీద విసిరేశారు.
తన అల్లుడి హత్యకు ప్రతీకారంగా.. ఓ వ్యక్తిని నడిరోడ్డులో అతడి భార్య కళ్లెదుటే తల నరికి చంపించడమే కాక, ఆ తలను రోడ్డుమీద విసిరేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని మదురై జిల్లాలో జరిగింది. మదురై సమీపంలోని నీలకొట్టాయ్ ప్రాంతానికి చెందిన అళగురాజా పంది పిల్లలను అమ్మి జీవిస్తుంటాడు. ఈనెల 14న అతడు తన బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భార్యతో కలిసి తిరుమంగళం వెళ్లాడు. అక్కడ కార్యక్రమం అయిపోయాక భార్యతో కలిసి సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అంతలో నలుగురు వ్యక్తులు మోటారుసైకిళ్లపై వచ్చి అతడిపై దాడి చేశారు. అళగురాజాను బయటకు లాగి, అతడి తల నరికి రోడ్డుమీద విసిరేసి వెళ్లిపోయారు. ఇదంతా అతడి భార్య కళ్లెదుటే జరిగింది.
అళగురాజా వ్యాపార ప్రత్యర్థి నగేష్ అల్లుడు కొన్నివారాల క్రితం హత్యకు గురయ్యాడు. ఆ హత్యలో ఇతడి పాత్ర ఉందనేది వాళ్ల అనుమానం. అళగురాజాను చంపినవారిలో తమ బంధువు ఒకరున్నట్లు అతడి భార్య తేను గుర్తించింది. రోడ్డుమీద తల పడి ఉండటంతో అటుగా వెళ్లేవారంతా భయకంపితులయ్యారు. దాడిలో తేనుకు కూడా గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు.