యోగిని అభ్యర్థిస్తూ.. వ్యక్తి ఆత్మాహుతి యత్నం!
గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం ముందు ఓ వ్యక్తి ఆత్మాహుతి యత్నానికి ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్‌కు రెండురోజుల పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయన దృష్టికి తన డిమాండ్‌ను తీసుకొచ్చే ఉద్దేశంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకునేందుకు ప్రయత్నించాడు. తాను చికిత్స కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని అభ్యర్థిస్తూ అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.
సమీపంలో ఉన్న వారు వెంటనే దీనిని గుర్తించి..అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. యూపీలో అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం యోగి తన తొలికేబినెట్ సమావేశంలో రుణమాఫీ గురించి చర్చించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ వక్తి తన రుణమాఫీ కోసం ఒకప్పటి యోగి నివాస ప్రదేశమైన గోరఖ్‌నాథ్ ఆలయం ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. అయితే, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అతని అభ్యర్థన సీఎం యోగి దృష్టికి వెళ్లిందా? లేదా? అన్నది తెలియరాలేదు.