
'కారు తగులబెట్టిన చోటే నిన్ను కాల్చేస్తాం'
అండర్ వరల్డ్ డాన్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ తెలిపారు.
ఘజియాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ తెలిపారు. తన చంపుతామంటూ గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్ లు వచ్చాయని చెప్పారు. 'దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టిన చోటే నిన్ను తగులబెడతాం' అంటూ ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు.
ముంబైలో డిసెంబర్ 9న వేలంలో రూ. 32 వేలకు దావూద్ కారును చక్రపాణి దక్కించుకున్నారు. తర్వాత దాన్ని ఘజియాబాద్ లో బహిరంగంగా తగులుబెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసినప్పుడు తనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తామన్నారని, తాను తిరస్కరించానని చక్రపాణి తెలిపారు.