ఉద్యోగం వల.. నరకంలో విలవిల!
- నరసరావుపేట నుంచి యూఏఈకి బాలికల అక్రమ రవాణా
- నిరుపేద కుటుంబాలే బ్రోకర్ల టార్గెట్
- నెలకు రూ.20 వేల జీతం అంటూ మాయమాటలు
- తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌లు
- హోటళ్లలో డ్యాన్సర్లుగా వ్యభిచారంలోకి
- మెయిల్ ద్వారా ‘సాక్షి’కి సమాచారం ఇచ్చిన గుంటూరు వాసి
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నుంచి బాలికల ను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్రోకర్లు మైనర్లను అక్రమంగా రవాణా చేస్తూ భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గాల్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఇప్పిస్తామని చెప్పడంతో కూలినాలి చేసుకొని జీవితాలు వెళ్లతీసేవారు.. వారి మాయమాటలు నమ్మి బాలికలను అరబ్ దేశాలకు పంపుతున్నారు. అయితే అక్కడ ఏంపని చేస్తున్నారనే విషయం మాత్రం వీరికి తెలియడం లేదు. వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన అనేక మంది బాలికలు వ్యభిచార కూపంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని నరసరావుపేట కేంద్రంగా కొందరు బ్రోకర్లు బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సైతం ఉలికిపాటుకు గురవుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. నరసరావుపేట పట్టణంలో పెద్దచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కనకం అనే మహిళకు చెన్నైకు చెందిన హరి అనే బంధువు ఉన్నాడు. హరి అప్పుడప్పుడు కనకం ఇంటికి వచ్చి వెళుతూ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనేక మంది నిరుపేదలకు వలవేసి వారి కుమార్తెలకు అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. భారీ వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తానని వల విసిరాడు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో కొందరు తల్లితండ్రులు తమ కుమార్తెలను హరితో పంపారు.
ఇలా నరసరావుపేటకు చెందిన సుమారు పది మంది బాలికలను హరి అరబ్ దేశాలకు పంపి అక్కడ హోటళ్లు, పబ్‌ల్లో డ్యాన్సర్లుగాను, మరికొందరిని వ్యభిచార వృత్తిలోకి దించినట్లు సమాచారం. వెళ్లిన వారిలో కొందరు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా, మరికొందరు భయంతో ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయం కొందరు తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు.
వెలుగులోకి ఇలా...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వ్యభిచార గృహానికి వెళ్లిన గుంటూరు జిల్లా వాసికి నరసరావుపేటకు చెందిన ఓ మైనర్ బాలిక పరిచయమైంది. తెలుగు వ్యక్తి కలవటంతో ఆ బాలిక తన వేదన చెప్పి విలపించింది. తనను వ్యభిచార కూపం నుంచి తప్పించాలని వేడుకొంది. దీనికి చలించిన ఆయన.. వ్యభిచార గృహం నడిపే యజమానులకు కొంత పైకం చెల్లించి ఆమెను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిర్వాహకులు అంగీకరించలేదు. ఈ విషయంలో కలుగచేసుకుంటే హతమారుస్తామంటూ హెచ్చరించారు కూడా. అక్కడ జరిగిన వ్యవహారాన్ని మెయిల్ ద్వారా ఆయన ‘సాక్షి’ కి సమాచారాన్ని చేరవేశారు. దీనిపై నరసరావుపేటలో సాక్షి ఆరా తీయగా మైనర్ బాలికల అక్రమ రవాణా వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి సైతం వెళ్లటంతో బాలిక తల్లిని పిలిచి విచారిస్తున్నారు.
తప్పుడు జనన ధృవీకరణ çపత్రాలతో పాస్‌పోర్టులు
మైనర్ బాలికలకు పాస్‌పోర్టులు రావని తెలిసిన అక్రమార్కులు వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మార్చి, నకిలీ జనన ధృవీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు పొందుతున్నట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన బాలికలకు సైతం ఇదే తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించి హైదరాబాద్ చిరునామాలతో పాస్‌పోర్టులు పుట్టించినట్లు సమాచారం. అక్రమ రవాణా గుట్టు రట్టుయినా.. మైనర్ బాలికలు పేర్లు, అడ్రస్సులు తప్పుడువి కావటంతో తాము తప్పించుకోవచ్చనేది అక్రమార్కుల ఆలోచన.