పార్లమెంట్‌లో సీఎంల మంటలు!
బీజేపీ ముఖ్యమంత్రులపై ఆరోపణలతో దద్దరిల్లనున్న సమావేశాలు
కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు టార్గెట్
21 నుంచి మొదలుకానున్న వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రులపై వచ్చిన ఆరోపణలు ఈసారి పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనున్నాయి. వారు గద్దె దిగాల్సిందేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో గొంతెత్తనున్నాయి. జూలై 21నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపం కుంభకోణం వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, లలిత్‌గేట్ స్కాంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, పీడీఎస్ స్కాంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లపై ఆరోపణలను అస్త్రంగా మలిచి ప్రధాని నరేంద్రమోదీని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీ సీఎంలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రధాని ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ కూడా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్(కాంగ్రెస్) వ్యవహారాన్ని లేవనెత్తాలని భావిస్తోంది.
త్రిపురలో చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సర్కార్(సీపీఎం)ను నిలదీసేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేకపోతున్నారని విమర్శలపాలవుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్(ఎస్పీ), అనేక అంశాలపై కేంద్రంతో విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు సంధించనున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతమంది సీఎంలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించలేదు. ఈసారి మాత్రం ముఖ్యమంత్రులపై ఆరోపణలే ప్రధానాస్త్రాలుగా ఒకరిపై ఒకరు విరుచుకుపడేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతుండడం గమనార్హం. అలాగే లలిత్‌మోదీకి వీసా సాయమందించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, విద్యార్హతల విషయంలో వివాదంలో చిక్కుకున్న మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.
ప్రధాని భేటీకి కాంగ్రెస్ సీఎంల డుమ్మా!
భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు 15న మోదీ తలపెట్టిన సీఎం సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరించనున్నారు. భూసేకరణ బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు, ఈ సమావేశాల్లోనైనా బిల్లును గట్టెక్కించే ఉద్దేశంతో భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కాబోనని బెంగాల్ సీఎం మమత ఇప్పటికే వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత తొమ్మిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరైతే దేశవ్యాప్తంగా 30 మంది సీఎంలలో ఏకంగా 10 మంది ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టినట్టవుతుంది!
నేడు సోనియా ఇఫ్తార్ విందు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం పలు పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు తమతో కలసి వచ్చే పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ విందు సమావేశంలో సోనియా.. నేతలతో చర్చించనున్నారు. ఇఫ్తార్ విందుకు రావాల్సిందిగా ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), శరద్‌పవార్(ఎన్సీపీ), సీతారాం ఏచూరి(సీపీఎం), దేవెగౌడ(జేడీఎస్), అహ్మద్(ఐయూఎంఎల్), కనిమొళి(డీఎంకే), డి.రాజా(సీపీఐ), సుధీప్ బంధోపాధ్యాయ(తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్)కు ఆహ్వానాలు పంపారు.