పురుషులు 21 సెకన్లకు మించి ఉండలేరట!
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు జీవితంలో భాగంగా మారిపోయింది. ఆధునిక జీవనశైలిలో అదొక శరీరాంగంగా మారిపోయింది. మరి అలాంటి ఫోన్ ను చూడకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపు ఉండగలరు?.. ఐదు నిమిషాలో.. పది నిమిషాలో అనుకుంటున్నారా?.. అంతలేదు, కేవలం ఒక్క నిమిషం కూడా ఉండలేరని తాజా అధ్యయనం తేల్చింది. స్నేహితుడినో, సహోద్యోగిని కలువడానికి వెళ్లినప్పుడు, డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వేచిచూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ చూడకుండా మనషులు అస్సలు ఉండలేరని, నిమిషంలోపే స్మార్ట్ ఫోన్ ను చేతులు వెతుక్కుంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషులైతే ఇలాంటి సందర్భాల్లో 21 సెకన్లలోపే స్మార్ట్ ఫోన్ లోకి తొంగిచూస్తారని వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా కొందరు వ్యక్తులను ఓ గదిలో వేచి ఉండేలా చేసి పదినిమిషాలపాటు వారి తీరును గమనించారు. అయితే, ఈ పదినిమిషాల గడువులో సగటున 44 సెకన్లలోపే వారు తమ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండా ఉండలేకపోయారు. ఈ విషయంలో మహిళలు కొంత నయం. వారు సగటున 57 సెకన్ల పాటు వేచి ఉన్న తర్వాత తమ స్మార్ట్ ఫోన్ లోకి తొంగిచూడగా.. పురుషులు మాత్రం 27 సెకన్లకు మించి ఉండలేకపోయారు. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై ల్యాబ్ తరఫున జర్మనీలోని వుర్జ్ బర్గ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ టెంట్ యూనివర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.
డిజిటల్ పరికరాలతో మనుషులు పెనవేసుకున్న సహచర్యాన్ని గుర్తించేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వెయింటింగ్ రూమ్ లో ఉన్నప్పుడు మీరు ఎంతసేపటి తర్వాత మొబైల్ ఫోన్ ను చూశారని అధ్యయనంలో పాల్గొన్నవారిని అడుగగా.. చాలామంది రెండు నుంచి మూడు నిమిషాల తర్వాతే తాము స్మార్ట్ ఫోన్ ను చూశామని చెప్పారు. 'ప్రజలు తాము అనుకుంటున్న దానికన్నా ఎక్కువగానే ఈ పరికరాలతో ముడిపడిపోయారని మా అధ్యయనంలో తేలింది. వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమాత్రం స్మార్ట్ ఫోన్స్ కు దూరంగా ఉండలేని పరిస్థితి సహజ స్వభావంగా మారిపోయింది' అని ఈ అధ్యయనం నిర్వహించిన జెన్స్ బెండర్ తెలిపారు.