మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా
మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా
Published Wed, Sep 4 2013 2:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
ముంబై: రెండు దిగ్గజ కంపెనీలు ఒకటి కానున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగ రారాజు మైక్రోసాఫ్ట్... మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 720 కోట్ల డాలర్లను(సుమారు రూ. 47,520 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా ఇప్పటికే మొబైల్ మార్కెట్‌ను ఏలుతున్న శామ్‌సంగ్, యాపిల్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. డీల్ తరువాత నోకియా కేవలం నెట్‌వర్క్ పరికరాల తయారీ సంస్థగా మిగలనుండగా, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హార్డ్‌వేర్‌లోనూ రాణించనుంది. కాగా, నోకియా ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ద్వారా మొబైళ్లు, ట్యాబ్లెట్ల వృద్ధిలో ముందున్న ఇండియా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టంకానుంది.
డీల్ వెల్లడికావడంతో హెల్సింకీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నోకియా షేరు 40% దూసుకెళ్లగా, నాస్‌డాక్‌లో మైక్రోసాఫ్ట్ షేరు నామమాత్రంగా లాభపడింది. డీల్‌లో భాగంగా నోకియా ఫోన్ల బిజినెస్‌తోపాటు, క్వాల్‌కామ్ తదితర ఐపీ లెసైన్స్‌లను కూడా మైక్రోసాఫ్ట్ చేజిక్కిం చుకోనుంది. టెలికం పరికరాల విభాగం నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వ ర్క్స్, లొకేషన్ మ్యాపింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ నోకియాకు మిగులుతాయి.
మళ్లీ మైక్రోసాఫ్ట్ గూటికి స్టీఫెన్
ప్రస్తుత నోకియాను నడిపిస్తున్న కెనడియన్ బాస్ ‘స్టీఫెన్ ఎలాప్’ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ బిజినెస్ విభాగాన్ని నిర్వహించిన వ్యక్తే. కాగా, నోకియాతో డీల్ కారణంగా స్టీఫెన్ తిరిగి మైక్రోసాఫ్ట్ తరఫున పనిచేయనున్నారు. 2010లో ఆయన నోకియాకు తరలి వెళ్లారు. వెరసి ఇకపై ఎలాప్‌తోపాటు మొత్తం 32,000 మంది నోకియా సిబ్బంది మైక్రోసాఫ్ట్ తరఫున విధులు నిర్వర్తించనున్నారు. డీల్ వల్ల బ్లాక్‌బెర్రీకి పోటీ తీవ్రంకానుందని నిపుణులు పేర్కొన్నారు.
అందరికీ ప్రయోజనమే
నోకియాతో డీల్ తమ రెండు కంపెనీలకూ చెందిన ఉద్యోగులతోపాటు... వాటాదారులు, వినియోగదారులకు కూడా ప్రయోజనకరమేనని మైక్రోసాఫ్ట్ సీఈవో బామర్ పేర్కొన్నారు. అటు సాఫ్ట్‌వేర్ విభాగంలోనూ, ఇటు ఫోన్ల మార్కెట్లోనూ తమ సంస్థతోపాటు, భాగస్వామ్య కంపెనీలు కూడా డీల్ వల్ల లబ్ధి పొందుతాయని వ్యాఖ్యానించారు. కంపెనీకి తిరిగి వస్తున్న స్టీఫెన్ ఇకపై మొబైళ్లు తదితర తమ మొత్తం పరికరాల టీమ్‌లను నిర్వహిస్తారని బామర్ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
లూమియా, ఆశా బ్రాండ్లు
డీల్‌లో భాగంగా లూమియా, ఆశా బ్రాండ్లతోపాటు, ఫీచర్ ఫోన్లకు నోకియా పేరును పదేళ్లపాటు మైక్రోసాఫ్ట్ వినియోగించుకోనుంది. దీంతోపాటు 8,500 డిజైన్లకు సంబంధించిన పేటెంట్లు, మ్యాపింగ్ సర్వీసుల లెసైన్స్‌ను కూడా పొందుతుంది.
Advertisement
Advertisement