
ఉధంపూర్ లో దాడి ఘటనలో పట్టుబడ్డ ఉగ్రవాది మొహమ్మద్ నవేద్ యాకూబ్
కశ్మీర్‌లో ఇద్దరు గ్రామస్తుల తెగువతో దొరికిన టైస్ట్
పాక్ నుంచి వచ్చానని వెల్లడి
అంతకుముందు మరో ఉగ్రవాదితో కలసి బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడి
* ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి; 11 మందికి గాయాలు
* ప్రతిదాడిలో హతమైన ఒక ఉగ్రవాది
ఉధంపూర్/న్యూఢిల్లీ: భారత్‌పై విషం చిమ్ముతూ ఉగ్రదాడులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ విద్రోహాలను బట్టబయలు చేసే మరో సజీవ సాక్ష్యం భారత్‌కు చిక్కింది.
భారత్‌లో మారణహోమం సృష్టించేందుకు సరిహద్దులు దాటి వచ్చిన ఓ పాక్ ఉగ్రవాదిని బుధవారం ఇద్దరు భారత పౌరులు ప్రాణాలకు తెగించి, ప్రాణాలతో పట్టుకున్నారు. పాక్ దుశ్చర్యలను ససాక్ష్యంగా ఎండగట్టేందుకు అవసరమైన కీలక ఆధారాన్ని భారత ప్రభుత్వానికి అందించారు. అయితే, అప్పటికే ఆ ముష్కరుడి, అతడి సహచరుడి దాడిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు..
బుధవారం ఉదయం 8 గంటల సమయంలో జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై శ్రీనగర్‌వైపు వెళ్తున్న సరిహద్దు రక్షణ దళ(బీఎస్‌ఎఫ్) వాహన శ్రేణి ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి వద్దకు చేరుకోగానే సాయుధులైన ఇద్దరు ఉగ్రవాదులు.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆ కాన్వాయ్‌పై గ్రెనేడ్లతో దాడి ప్రారంభించారు. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తేరుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రతిదాడి ప్రారంభించారు.
ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన హరియాణాకు చెందిన కానిస్టేబుల్ రాకీ.. ఒక ఉగ్రవాదిని హతమార్చి, తానూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఉగ్రవాది తప్పించుకుని పక్కనే కొండల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలోకి వెళ్లాడు. అక్కడ ఐదుగురు గ్రామస్తులను బందీలుగా పట్టుకుని, స్థానిక పాఠశాలలో దాక్కున్నాడు. పారిపోయేందుకు దారి చెప్పాలని, లేదంటే అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటికే పోలీస్, ఆర్మీ ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. బందీలుగా చిక్కిన గ్రామస్తుల్లో గ్రామ రక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు.
వారిలో ఇద్దరు రాకేశ్ కుమార్, విక్రమ్‌జిత్‌లు ధైర్యంగా ఆ ఉగ్రవాదిని ఎదిరించడం ప్రారంభించారు. విక్రమ్‌జిత్ ఆ టైస్ట్ మెడను గట్టిగా పట్టుకోగా, రాకేశ్ తుపాకీ కాల్చకుండా అడ్డుకున్నాడు. అయినా, ఆ ఉగ్రవాది కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తూ అవి రాకేశ్, విక్రమ్‌జిత్‌లకు తగల్లేదు. పెనుగులాటలో ఆ ఉగ్రవాది కిందపడిపోయాడు. అతన్ని అలాగే బంధించి వారిద్దరూ పోలీసులకు అప్పగించారు. ఈలోగా బందీలుగా ఉన్న మరో ముగ్గురు గ్రామస్తులు దేశిరాజ్, సుభాష్ శర్మ, జీవన్‌లు తప్పించుకుని గ్రామంలోకి పారిపోయారు. జమ్మూలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంతంలో బంద్ పాటిస్తున్నారు. అందువల్ల ఆ స్కూల్‌లో విద్యార్థులెవరూ లేరు.
పాక్ నుంచి సరి‘హద్దులు’ దాటి..
అనంతరం పోలీసుల విచారణలో తమ వివరాలను ఆ ఉగ్రవాది వెల్లడించాడు. మొదట తన పేరు ఖాసిమ్ ఖాన్ అని, ఆ తరువాత ఉస్మాన్ అని చెప్పి, చివరగా తన అసలుపేరు మొహమ్మద్ నవేద్ యాకూబ్ అని తెలిపాడు. తనకు 20 ఏళ్లని, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ పట్టణంలో ఉన్న గులం ముస్తఫాబాద్ ప్రాంతానికి చెందినవాడినని వివరించాడు. తనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉందని చెప్పాడు. వారిలో ఒకరు లెక్చరర్‌గా పనిచేస్తున్నారని, మరొకరికి చిన్న వస్త్ర దుకాణముందని తెలిపాడు.
జవాన్ల కాల్పుల్లో చనిపోయిన టైస్ట్ పేరు నొమన్ అలియాస్ మొమిన్ అని, అతడు భావల్పూర్‌కు చెందిన వాడని తెలిపాడు. గత నెలలో తను, మరో నలుగురు ఉగ్రవాదులు కలిసి భారత్‌లో ఉగ్రదాడి చేసే ఉద్దేశంతో కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోకి వచ్చామని, అయితే, తమకు గైడ్‌గా రావల్సిన వ్యక్తి సమయానికి రాకపోవడంతో మళ్లీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిపోయామని వెల్లడించాడు. మళ్లీ కొన్ని రోజుల తరువాత, ముగ్గురితో కలిసి బారాముల్లా వద్ద సరిహద్దు ఫెన్సింగ్‌ను కత్తిరించి భారత్‌లోకి వచ్చామని, అవంతిపుర-పుల్వామా దగ్గర్లోని ఒక గుహలో దాక్కున్నామని వెల్లడించాడు.
మంగళవారం తాను, నోమన్ కలిసి ఒక ట్రక్‌లో ఉధంపూర్ చేరుకున్నామని తెలిపాడు. అనంతరం అతడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో టీవీ కెమెరాల వైపు నవ్వుతూ చూస్తూ.. విలేకరుల ప్రశ్నలకు ఎలాంటి బెదురు లేకుండా అతడు సమాధానాలివ్వడం విశేషం. ‘ఇలా చేయడం(ప్రాణాలు తీయడం) నాకు సరదాగా ఉంది. ఇందులో నేను చనిపోతే అది అల్లా ఆజ్ఞగా భావిస్తా’నని నిర్భయంగా సమాధానమిచ్చాడు. ముంబైలో భీకర దాడులకు పాల్పడిన కసబ్ నవేద్ కన్నా ముందు సజీవంగా భారత దళాలకు చిక్కాడు. 26/11 ముంబై దాడుల్లో పాక్ పాత్రను ఆ దేశ ఎఫ్‌ఐఏ మాజీ అధికారే స్వయంగా వెల్లడించిన మర్నాడే.. పాక్ కుట్రలను బట్టబయలు చేసే మరో సజీవ సాక్ష్యం లభించడం విశేషం.
చర్చల విషయంలో ముందుకే!
భారత్, పాక్ ప్రధానమంత్రుల ఇటీవలి భేటీలో నిర్ణయించిన మేరకు, ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారుల స్థాయి చర్చల విషయంలో ముందుకే వెళ్లాలనుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో జరపాలని తలపెట్టిన ఆ చర్చలకు సంబంధించి తాము పంపిన ఆహ్వానంపై పాక్ నుంచి ఇంకా ఏ స్పందన రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. గతవారం గురుదాస్‌పూర్‌లో, తాజాగా జమ్మూలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడుల నేపథ్యంలో చర్చల నుంచి భారత్ తప్పుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
పోలిసుల ఎదురుదాడిలో హతమైన ఉగ్రవాది
వీరు లష్కరే ముష్కరులే!
బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన వారిని పాక్ నుంచి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా భావిస్తున్నామని జమ్మూ ఐజీ డేనిష్ రాణా తెలిపారు. వీరి దాడిలో కానిస్టేబుల్ రాకీతో పాటు మరో కానిస్టేబుల్ శుబేందు రాయ్(పశ్చిమబెంగాల్) కూడా చనిపోగా, 11 మంది జవాన్లు గాయాలపాలయ్యారని వివరించారు. క్షతగాత్రులను జమ్ము, ఉధంపూర్‌ల్లోని ఆసుపత్రులకు తరలించామన్నారు. ఈ దాడికి అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నది కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ దాడికి ముందేఅమర్‌నాథ్ యాత్రికులు అదే దారి గుండా వెళ్లారు. పాక్‌కు ఇప్పటికైనా తగిన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రాణాలతో ఒక టైస్ట్‌ను పట్టుకోవడం చాలా అరుదని, ఇది భద్రతాదళాలకు, భారత ప్రభుత్వానికి గొప్ప విజయమని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. భారత్‌లో ఉగ్రవాద చర్యల్లో పాక్ పాత్రను స్పష్టం చేసే సాక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ముందు అతడిని చూపవచ్చన్నారు. భారత్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న 17 మంది ఉగ్రవాదులను ఈ ఏడాదిలో ఇప్పటివరకు హతమార్చామని లెఫ్ట్‌నెంట్ జనరల్ సుబ్రత సాహ తెలిపారు.
రాక్‌ఫోర్స్.. రాకీ!
న్యూఢిల్లీ: ఈ దాడిలో సహచరుల ప్రాణాలు కాపాడి, తాను ప్రాణాలొదిలిన కానిస్టేబుల్ రాకీ(27) బీఎస్‌ఎఫ్‌లో ఇటీవలే చేరాడు. ఉగ్రవాదుల దాడిలో తనకు బుల్లెట్ గాయాలైనా తట్టుకుని.. తన తుపాకీలోని 40 బుల్లెట్లు ఖాళీ అయేంతవరకు వారిపై తూటాలవర్షం కురిపించాడు. వారికి జవాన్లతో నిండి ఉన్న బస్‌పై గ్రెనేడ్లు విసిరే సమయం, అవకాశం ఇవ్వకుండా దాడి కొనసాగించాడు. అదనపు బలగాలు వచ్చేవరకు వారిని నిలువరించాడు. టైస్ట్‌లపై సహచరులు పొజిషన్స్ తీసుకుని, దాడి చేసేందుకు వీలు కల్పించాడు.
రాకీ అంత వీరోచితంగా పోరాడి ఉండకపోతే.. మరి కొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయేవారని బీఎస్‌ఎఫ్ డీజీ డీకే పాఠక్ స్వయంగా చెప్పడం రాకీ చూపిన సాహసానికి అద్దం పడుతోంది. తన యూనిట్‌లో రాకీని అంతా ‘రాక్‌ఫోర్స్’గా పేర్కొనేవారని, పేరుకు తగ్గట్లే వీరోచితంగా, హీరోలా పోరాడాడని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు కొనియాడారు.