
కసబ్ తర్వాత చిక్కింది ఉస్మానే
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉదంపూర్ ఉగ్రవాద దాడి ఘటనలో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్), సైన్యం పట్టుకున్న ఉగ్రవాదిని పాకిస్థాన్ జాతీయుడిగా గుర్తించారు. ఉగ్రవాది పాకిస్థాన్లోని ఫైసలాబాద్కు చెందినవాడని, అతడి పేరు ఖాసింఖాన్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అని సీనియర్ పోలీస్ అధికారి డానిష్ రానా చెప్పారు. కసబ్ తర్వాత ప్రాణాలతో దొరికిన రెండో పాక్ ఉగ్రవాది ఉస్మానే.అతడి వద్ద ఒక ఏకే-47 తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని గ్రామంలోకి వెళ్లి ముగ్గురిని బందించారు. బీఎస్ఎఫ్తో పాటు ఆర్మీ రంగంలోకి దిగిన బందీలను విడిపించాయి. ఉగ్రవాదులో ఒకడిని సజీవంగా పట్టుకోగా, మిగిలిన వారు పారిపోయారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రత చర్యలను పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్ జమ్మూకు వెళ్లారు.