తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించుకుంటామని, దీనిపై ఎవరూ ఆందోళన, దిగులు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు వీలైనంత వరకూ న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉద్యోగుల సమస్య పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. బుధవారం రవీంద్రభారతిలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీఓల సదస్సులో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలనాథన్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి చివరి నివేదిక ఇస్తుందన్న నమ్మకం తనకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పిచ్చిపట్టిన ధోరణిలో వ్యవహరిస్తోందని, 19 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి పాలనాపరంగా కేంద్రం చుక్కలు చూపిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన చండీయాగం మాదిరిగా రాష్ట్ర పునర్నిర్మాణానికి యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీఓల నగర శాఖ భవనానికి ప్రభుత్వం తరఫున స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి 12 కార్పొరేట్ ఆస్పత్రులతో వైద్యమంత్రి మాట్లాడుతున్నారని చెప్పారు.
పీఆర్‌సీ, బకాయిలకు సంబంధించిన సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, స్వగృహలో ఉద్యోగులకు ప్లాట్లు కేటాయిస్తామని, మిగిలినవారికి ఎక్కడ ఇవ్వాలనే విషయం ఆలోచిస్తామని చెప్పారు. ఉద్యోగులందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త జిల్లాలు వస్తాయన్నారు. ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని, త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు.
శాంతియుత పరిస్థితి నెలకొంది
రెండు రాష్ట్రాల మధ్యా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇరువైపుల వాతావరణం చల్లబడిందని కేటీఆర్ చెప్పారు. ఇద్దరు సీఎంల మధ్యా శాంతియుత పరిస్థితి నెలకొందన్నారు. ‘వారు పిలిస్తే మనం వెళ్లాం. మనం పిలిస్తే వారు వస్తున్నారు. ప్రాంతాలుగా విడిపోయామంతే.. మన మధ్య పగ, ద్వేషాలు లేవు’ అని చెప్పారు. ఇద్దరు చంద్రులు కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఉద్యోగుల సమస్య కొలిక్కి వస్తుందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కమలనాథన్ కమిటీ ఓ పిచ్చి కమిటీ అని, కేంద్రం రాష్ట్రానికి సహకరించడంలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హమీద్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం హుస్సేని, సచివాలయ శాఖ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ రెడ్డి, హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షకార్యదర్శులు కె.వెంకటేశ్వర్లు, ఎం లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు కె. లక్ష్మణ్, ఎల్ రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.