స్కైవేలకు 100 ఎకరాలివ్వండి
♦ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరిన మంత్రి కేటీఆర్
♦ రక్షణ శాఖ భూమి ఇస్తే.. బదులుగా మరోచోట భూమి ఇస్తాం
♦ రహదారుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని గడ్కారీకి వినతి
♦ హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయండి
♦ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ని కోరిన కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మ కంగా నిర్మించతలపెట్టిన ప్యాట్నీ సెంటర్– కొంపల్లి, జూబ్లీ బస్టాప్–తూంకుంట స్కైవేల నిర్మాణాలకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించా లని కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి కె.తారకరామారావు కోరారు. మంగళ వారం జైట్లీని ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో కలుసుకున్న కేటీఆర్.. స్కైవేల నిర్మాణాని కి రక్షణ శాఖ పరిధిలోని భూమి బదలాయిం పు, కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల మూసివేత అంశాలపై చర్చించారు.
స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూమిని బదలాయి స్తే.. దానికి బదులుగా మరోచోట భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ వివరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కంటోన్మెంట్ పరిధిలో రహదారుల మూసివేతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జైట్లీ.. రక్షణ శాఖ ఉన్నతా ధికారులతో జరగనున్న సమావేశంలో ఈ విష యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు కేటీఆర్ మీడియాకు తెలిపారు.
జాతీయ రహదారులను పూర్తి చేయండి..
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని పార్లమెంటులో కలుసుకున్న కేటీ ఆర్.. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న జాతీ య రహదారులను త్వరితగతిన పూర్తి చేయా లని కోరారు. ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయ చూర్ వెళ్లే మార్గంలో కొత్తకోట–గద్వాల్, అలాగే మల్లంపల్లి–నకిరేకల్ జాతీయ రహ దారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ రహదారుల పనుల పురోగతిపై నివేదికలు పంపితే వెంటనే పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. అంబర్‌పేట్– రామంతపూర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.248. 70 కోట్లు విడుదల చేసినందుకు గడ్కారీకి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయండి
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్‌ను కేటీఆర్ కోరారు. ఈ విషయంలో సౌదీలో భారత రాయబారితో మంత్రి మహమూద్ అలీ ఇది వరకే చర్చించా రని, సౌదీ అధికారులు భారత్‌లో మరో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే దా న్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, సీతారాం నాయక్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ బకాయిలు విడుదల చేయండి: జూపల్లి
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణకు గతేడాదికి విడుదల కావాల్సిన రూ.940 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. మంగళవారం ఈ మేరకు కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలుసుకొని వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ ఏడాదికి అడ్వాన్సుగా రూ.1,200 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణలో 100 శాతం అమలు చేస్తున్నామని, అందుకు అనుగుణంగా నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఎంజీఎస్‌వై కింద గ్రామీణ ప్రాంతాల్లో 2,817 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.