విదేశాలకెళ్లి జైలుపాలై.. తెలుగోళ్ల గోడు!
విదేశాలకెళ్లి జైలుపాలై.. తెలుగోళ్ల గోడు!
Published Mon, Nov 7 2016 8:39 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలసజీవుల జీవితాలు ఛిద్రమయ్యాయి. అప్పులు చేసి వీసాలు తీసుకుని దేశం కాని దేశానికి వెళ్లిన బడుగుజీవుల ఆశలు అడియాసలయ్యాయి. ఆఖరికీ జైలుపాలై పలువురు తెలుగువారు దీనంగా బతుకీడుస్తున్నారు.
స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న విదేశీయులను ఇంటికి పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు వలస జీవులు ఉద్యోగాలు పోయాయి. అప్పులు చేసి సౌదీకి వస్తే.. ఆ అప్పులు తీరకముందే ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో చాలామంది కంపెనీల్లో ఉద్యాగాలు పోయినా.. బయట చిన్నాచితక పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అయితే, వీరి వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో వారిని సౌదీ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన 300 మంది వలస జీవులు అవుట్ పాస్‌పోర్టు లేక ఇలా బందీలుగా కారాగార వాసం చేస్తున్నారు.
పట్టించుకోని ఎంబసీ అధికారులు..
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం(ఎంబసీ) అధికారులు ఈ వలస జీవులను ఆదుకోవాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను గుర్తించి.. వారికి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాల్సి బాధ్యత ఎంబసీ అధికారులది. కానీ ఎంబసీ అధికారుల్లో చాలామంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో తమను వారు పట్టించుకోవడం లేదని తెలంగాణ వలస జీవులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు జోక్యం చేసుకుని విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడితే అవుట్ పాస్‌పోర్టులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.
Advertisement
Advertisement