వాటర్‌గ్రిడ్‌పై బాబు కుట్ర
జడ్చర్ల: గొంతెండిన పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి ఉత్తరాలు రాస్తూ అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లూరు వద్ద కృష్ణా నది నుంచి వాటర్‌గ్రిడ్‌కు 19 టీఎంసీల నీటిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ అడ్డుపుల్లలు వేస్తున్నారని దుయ్య బట్టారు. దీనిపై ఇటీవల ఏపీ సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీడబ్ల్యూసీకి లేఖ రాశారని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పైలాన్ ఆవిష్కరించి వాటర్‌గ్రిడ్ పథకానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా.. తెలంగాణకు సం బంధించి కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. 900 టీఎంసీల గోదావరి జలాలను, 300 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోవచ్చని కిరణ్ చె ప్పారన్నారు. 1,200 టీఎంసీల్లో తాగునీటి అవసరాలకు 120 టీఎంసీలు వినియోగించుకునే హక్కు ఉందన్నారు. అయితే ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ ద్వారా 40 టీఎంసీలను మాత్రమే తీసుకుంటున్నామన్నారు.
రెండేళ్లలో ఇంటింటికీ తాగునీరు: రాష్ట్రంలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా 10 జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు కృష్ణానదిపై 26 చోట్ల నీటిని తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో పాత పైపులై న్లను తొలగించి 1.50 లక్షల కి.మీ. పేర కొత్త పైపులైన్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. 18,900 వాటర్ ట్యాంకులు నిర్మిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండేళ్లలో వాటర్‌గ్రిడ్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ తాగునీళ్లు అందిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు.