watergrid
-
ఔటర్ చుట్టూ.. వాటర్ వండర్!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ చేపట్టనున్న జలహారం(వాటర్‌గ్రిడ్) పనుల్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఔటర్ చుట్టూ 18 ప్రదేశాల్లో భూమి పైభాగం నుంచి సుమారు3–4 మీటర్ల లోతున సొరంగమార్గాలు తవ్వి వాటిల్లో రేడియల్ మెయిన్ భారీ తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. సొరంగాలతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లు, రహదారులు, గ్రామాలు దెబ్బతినకుండా చూడవచ్చు. మహానగర దాహార్తిని దూరం చేసేందుకు రూ.4,765 కోట్ల అంచనా వ్యయంతో భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, జలమండలి మార్గదర్శకాల మేరకు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో ప్రతి అంశం సాంకేతికంగా ఎన్నో అద్భుతాలకు మూలం కానుండటం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ చుట్టూ 120 మిలియన్ లీటర్ల నీటినిల్వ సామర్థ్యంతో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఈ రింగ్‌మెయిన్ ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాలను నగరం నలుమూలలకూ కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. దేశంలో ఇప్పటివరకు ఏ నగరంలో లేని తరహాలో ఈ రింగ్ మెయిన్ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం చేయడం విశేషం. నవంబర్ నాటికి ఔటర్ గ్రామాల దాహార్తి దూరం ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 183 పంచాయతీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు పది లక్షల మంది దాహార్తిని ఈ ఏడాది నవంబర్ నాటికి సమూలంగా దూరం చేస్తామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ తాగునీటి పథకంలో ఇప్పటికే 70 గ్రామాల దాహార్తిని దూరం చేసేందుకు 60 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. 615 కి.మీ. మార్గంలో నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు మూడు లక్షల మంది దాహార్తిని దూరం చేశామన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఔటర్ గ్రామాల్లో ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలో ఒకటి, మహేశ్వరం మూడు, శంషాబాద్ 5, సరూర్‌నగర్ మూడు, రాజేంద్రనగర్ ఏడు, హయత్‌నగర్ తొమ్మిది, పటాన్చెరు 10, ఘట్కేసర్ 9, కుత్బుల్లాపూర్ ఐదు, కీసర 4, శామీర్‌పేట్ 4 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. మిగిలిన 112 రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిలో అక్టోబర్‌లో 20, మిగిలిన వాటిని నవంబర్‌లో పూర్తి చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు ఇదీ.. రూ. 3,965 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158 కి.మీ. మార్గంలో 3000 ఎంఎం వ్యాసార్థంలో భారీ పైపులైన్ నిర్మాణానికి వ్యయం రూ. 550 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు లోపల 18 చోట్ల 98 కి.మీ. మార్గంలో రేడియల్ మెయిన్ పైపులైన్ల ఏర్పాటుకు.. రూ. 250 కోట్లు - ఔటర్ చుట్టూ 12 చోట్ల భారీ గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ల(జీఎల్ఎస్ఆర్) నిర్మాణానికి.. రూ. 4,765 కోట్లు - మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం... -
ప్రాజెక్ట్ వరద నీటిలోనే మిషన్ భగీరథ
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటి మట్టం 146.80 మీటర్లు కాగా, ఎల్లంపల్లిలో దాదాపు 16 టీఎంసీలపైగా నీటి సామర్థ్యం ఉంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సమీపంలో చేపడుతున్న మిషన్ భగీరథ(వాటర్ గ్రిడ్) పనులు ఇంకా నీట మునిగి ఉన్నాయి. దాదాపు ఆరు రోజులుగా ఈ పనులు మొత్తం నీటిలోనే ఉండటంతో పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం, ప్రాజెక్ట్‌లో ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. రూ. 8 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో స్లాబ్ పనులు పూర్తి కాగా, 20 శాతం పనులు..ఫుట్‌బ్రిడ్జ్, బ్రిక్స్ వర్క్స్, మోటార్ల బిగింపు తదితర పనులు మిగిలి ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరగడంతో ఇంటెక్ వెల్ పనులు నిలిచిపోయాయి. ఓ వైపు సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ కాగా ఇంకా ఈ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు నీట మునగడంతో పనులు తిరిగి ప్రారంభం కావడంతో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ఇప్పట్లో వరద నీరు తగ్గే అవకావం కనిపించడం లేదు. ఏది ఏమైనా పనులు ప్రారంభం కావాలంటే నీరు తగ్గే వరకు వేచి చూడటం తప్పదు. -
ఏప్రిల్ 30లోపు తాగునీరివ్వాలి
వాటర్‌గ్రిడ్‌పై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం నిర్ణీత సమయంలో పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం ప్రోత్సాహకం శరవేగంగా ఇంటింటికీ నల్లా నీరు అందించాలి పైపులైన్ల అనుమతులకు ప్రత్యేకంగా డీఎఫ్‌వో వాటర్‌గ్రిడ్ పనులపై ఐదు గంటలపాటు సమీక్ష సాక్షి, హైదరాబాద్: నిర్ణీత సమయంలో వాటర్‌గ్రిడ్ పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం అదనపు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే పైపులైన్ ద్వారా అనుసంధానమయ్యే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోగా మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా సాధించడానికి ప్రత్యేకంగా డీఎఫ్‌వోను నియమించాలని అటవీ శాఖకు సూచించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేయడానికి అనుగుణంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారమిక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో వాటర్‌గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి ఐదు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష జరిపారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడి స్థానికంగా ఉండే ఇబ్బందులకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఇన్‌టెక్ వెల్స్ నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులపైనే ఉందని, అందుకే నీటి సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద త్వరితగతిన అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. నా పొలం నుంచే పైపులైన్ పోతోంది వాటర్‌గ్రిడ్ ప్రాధాన్యాన్ని గుర్తించి పనుల్లో వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే.. ఓట్లు అడగబోమని తాను మాట ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇంటింటికీ నల్లా నీటిని ఇచ్చే ఈ పథకంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పారు. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం ఆరు అడుగుల లోతున పైపులైన్ వేయాలని, ఇది ఎవరి భూముల నుంచైనా వేసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో వేసే పైపులైన్ తన వ్యవసాయ భూమి (ఎర్రవెల్లి ఫామ్) నుంచే పోతోందని చెప్పారు. సీఎం మెదలుకుని ఎవరూ చట్టానికి అతీతులు కాదని అధికారులకు చెప్పారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేలా పనులు చేయాలని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పథకాలంటే పది, పదిహేనేళ్లు సాగదీసే అలవాటు ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ పద్ధతి పూర్తిగా మారాలి. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది. వీటిని అనుకూలంగా మలుచుకొని పనుల్లో వేగం పెంచాలి’’ అని చెప్పారు. పరస్పర సహకారం ఉండాలి రైల్వేశాఖ, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల ముఖ్య అధికారులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పరస్పర సహకారంతో ముందుకు పోవాలని వారిని సీఎం కోరారు. విద్యుత్ శాఖ చేస్తున్న ప్రయత్నాలను జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, సీనియర్ అధికారులు, వివిధ జిల్లాల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తాం'
ఆదిలాబాద్: జిల్లాలోని మోడేగావ్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సిద్ధిపేట స్ఫూర్తితో వాటర్ గ్రిడ్ ను సక్సెస్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. వాటర్ గ్రిడ్ కు రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
యూపీలోనూ వాటర్‌గ్రిడ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వెల్లడి ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంస త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని స్పష్టం యూపీలో అఖిలేశ్‌తో సమావేశమైన కేటీఆర్ వాటర్‌గ్రిడ్‌పై మంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కొనియాడారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కోట్లాది మంది దాహార్తి తీర్చే బృహత్ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ ఆహ్వానం మేరకు గురువారం లక్నో వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అధికారుల బృందానికి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. అఖిలేశ్‌తో పాటు ఆ రాష్ట్ర అధికారులతో కేటీఆర్ బృందం సమావేశమైంది. వాట ర్‌గ్రిడ్ ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని గ్రామాలన్నిటికీ మూడున్నరేళ్లలో నల్లా ద్వారా సురక్షిత మంచి నీరందించడమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమని చెప్పారు. నీరివ్వలేని పరిస్థితి తలెత్తితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాజెక్ట్‌లో భాగంగా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించామని మంత్రి చెప్పారు. పైప్లైన్ల ఏర్పాటు సమయంలోనే ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ కేబుల్స్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నట్లు తెలిపారు. రుణాలిచ్చేందుకు హడ్కో, నాబార్డ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో పర్యటిస్తా: అఖిలేశ్ యాదవ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ తీరుతెన్నుల గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణకు వస్తానని అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేపడతామని, సాంకేతిక సహాయం అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. యువకుడు అయినప్పటికీ మంత్రిగా కేటీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆ రాష్ట్ర జల నిగమ్ మేనేజింగ్ డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ములాయంతోనూ కేటీఆర్ భేటీ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన విందు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాలపై కొద్దిసేపు ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ లో బృహత్తర పథకాల అమలు పట్ల మంత్రి కేటీఆర్ చొరవను ములాయంసింగ్ యాదవ్ మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. -
ఇల్లు కట్టిస్తే.. రెండు తరాలు నిలవాలి
-
రెండు తరాలు నిలవాలి
కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో డబుల్ బెడ్రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం అవినీతికి తావు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి ఈ ఏడాది 60 వేల ఇళ్లు కడదాం గ్రామాల్లో 36 వేలు, పట్టణాల్లో 24 వేలు నిర్మించాలి ఎమ్మెల్యేలు, మంత్రులు చెరో 50% మంజూరు చేస్తారు తప్పు దొర్లితే ఎంతటివారికైనా శిక్ష తప్పదు కరువు బారిన పడిన రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు డిసెంబర్ 31లోగా చెరువుల పనులు మొదలవ్వాలి సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘‘గతంలో పేదలకు ఇళ్లు అనగానే ఊరికి దూరంగా, విసిరేసినట్టుగా నిర్మించారు. డబ్బాల్లాంటి ఆ ఇండ్లలో ఎవరూ నివాసం ఉండటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిర్మించనున్న గృహాలు నిరుపేద కుటుంబాలకు రెండు తరాలకు పనికొచ్చేలా ఉండాలి. పేదల ఆత్మగౌరవం కాపాడేలా వాటిని నిర్మించాలి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ కార్యక్రమంలో కీలకంగా పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మహమూద్ అలీ ప్రారంభోపన్యాసం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాజెక్టులకు భూ సేకరణ, వాటర్‌గ్రిడ్, కరువు పరిస్థితులపై సీఎం ఈ సందర్భంగా సమీక్ష జరిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంలో కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని సూచించారు. ‘‘పైలట్ ప్రాజెక్టుగా ముందుగా అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున ఇండ్లను కట్టాలి. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచుతాం. ఈ ఏడాది 60 వేల ఇళ్లు కడదాం. గ్రామీణ ప్రాంతాల్లో 36 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లు కడతాం’’ అని సీఎం ప్రకటించారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.3 లక్షలు ఖర్చవుతుందన్నారు. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే ఈ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలను అధికారులకు సీఎం చూపించారు. అర్హులనే ఎంపిక చేయండి ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో 50 శాతం ఎమ్మెల్యే, 50 శాతం జిల్లా మంత్రి మంజూరు చేస్తారని సీఎం పేర్కొన్నారు. అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ‘‘తహశీల్దార్లు ఇచ్చే సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. తప్పు దొర్లితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. జాబితాలను కలెక్టర్లు సూపర్‌చెక్ చేయాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ చేయండి. కాలనీలకే ప్రాధాన్వమివ్వండి. ప్రభుత్వ భూమిని వినియోగించండి. అవసరమైతే... మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని వాడొద్దనే నిబంధనలు సడలిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాలున్న వారిలో గృహ నిర్మాణానికి అర్హులైన వారిని గుర్తించాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. నిబంధనల సాకుతో నిర్మాణాలు ఆపొద్దని, అవసరమైన మినహాయింపులు ఇస్తామని చెప్పారు. నిర్మాణాలకు ఇసుక తెచ్చుకునేందుకు సులభంగా అనుమతులివ్వాలని సూచించారు. ‘‘గతంలో గృహ నిర్మాణ కార్యక్రమంలో ఒకే ఏడాదిలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగింది. 300 మంది అధికారులు సస్పెండయ్యారు. కొందరు జైలుకెళ్లారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రావద్దు’’ అని స్పష్టం చేశారు. ‘‘అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా పని చేయాలి’’ అని అధికారులను హెచ్చరించారు. రైతులను ఆదుకునే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాల నివేదిక తయారు చేయాలని వర్షాభావ పరిస్థితులపై చర్చ సందర్భంగా సీఎం ఆదేశించారు. దానివల్ల కొన్ని మండలాలే కరువు జాబితాలోకి వస్తాయని అధికారులు చెప్పారు. దాంతో, కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. వేగంగా ప్రాజెక్టుల భూసేకరణ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కలెక్టర్లు చొరవ చూపాలని సీఎం అన్నారు. ప్రాజెక్టులపై ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని, వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతుల భూమికి, ఇంటికి, పశువుల కొట్టానికి వెల కట్టి ఒకేసారి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఖర్చయ్యే రూ.5.04 లక్షలు చెల్లించాలన్నారు. సాగునీటికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నందున డబ్బుల సమస్య లేదన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోందంటూసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్ ఆఫ్ వే ప్రయోగించండి వాటర్‌గ్రిడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, వాటిని కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరారు. ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణాలు బాగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పైపులైన్లు వేసేందుకు రైటాఫ్ వే చట్టాన్ని వాడుకోవాలన్నారు. ప్రాజెక్టు పూర్తి కావద్దనే ఉద్దేశంతో కొందరు తమ భూముల్లోంచి పైపులైన్లు వద్దని అడ్డుకుంటున్నారన్నారు. 1.6 మీటర్ల లోతున పైపులైన్ వేస్తున్నందున నష్టమేమీ ఉండదని, అందుకే కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 13,550 చోట్ల రైల్వే లైన్లు, రహదారులు, కాల్వలను పైపులైన్లు క్రాస్ చేయాల్సి వస్తుందని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. డిసెంబరు 31లోగా చెరువుల పనులు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులు డిసెంబర్ 31లోగా ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. మొదటి విడతలో ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని, రెండో విడతకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఫీడర్ ఛానళ్ల మరమ్మతులు చేయాలన్నారు. చెరువులు కబ్జాలకు గురవకుండా కఠిన చట్టాలు తెస్తామని చెప్పారు. చెరువుల కింద ఆయకట్టు నిర్ధారణకు సర్వేలు నిర్వహించాలన్నారు. నదులు, ఉపనదులు, కాల్వలపై నిర్మించే వంతెనలను చెక్‌డ్యామ్‌లుగా ఉపయోగపడేలా కట్టాలని చెప్పారు. ఇబ్బందికర నిబంధనలలొద్దు దళితులకు మూడెకరాల భూ పంపిణీకి అధికారులు మరింత చొరవ చూపాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలున్న భూములే కొనివ్వాలనే నిబంధనను తొలగించాలన్నారు. కొనుగోలుకు ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా ఎస్టీలకు వ్యవసాయ భూమి సమకూర్చాలని, ఆర్థిక స్వావలంబన పథకాన్ని ఎక్కువ మందికి ఉపయోగపడేలా అమలు చేయాలని అన్నారు. జీవో నం.58, 59 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామజ్యోతి ద్వారా అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. చెత్త సేకరణకు త్వరలోనే 25 వేల ట్రై సైకిళ్లు అందజేస్తామని వెల్లడించారు. చేంజ్ ఏజెంట్లతో కలెక్టర్లు నిరంతరం సమావేశాలు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక మార్పులో పోలీసు శాఖ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల, సిద్దిపేట ఆదర్శం రాష్ట్రంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు పెంచాలని, సామాజిక అడవులు పెంచాలని అన్నారు. ఫైరింజన్ల ద్వారా మొక్కలకు నీరు పోయాలన్నారు. అటవీ భూముల రక్షణకు, కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే వ్యూహం రూపొందించుకోవాలని సూచించారు. నల్లమల అడవుల్లోని షెడ్యూలు తెగల కుటుంబాల పునరావాసానికి కార్యాచరణ రూపొందించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను ఉపాధి హామీ నిధులతో పూర్తి చేయాలన్నారు. మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని అన్నారు. -
'ఒకే విడతలో రైతు రుణాలు మాఫీ చేయాల్సిందే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఒకే విడతలో అమలు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్కున్న నిధులు రుణమాఫీకి ఎందుకులేవని ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్‌లో భారీస్థాయి కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు సుమారు 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం ఆ సంఖ్యను తగ్గిస్తే సహేంచేది లేదని దుయ్యబట్టారు. 30 వేల కోట్ల టెండర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు తప్ప మరొకరికి సమాచారమే లేదని విమర్శించారు. రూ. వేల కోట్ల కమీషన్ల కోసమే వాటర్‌గ్రిడ్ కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేసిందన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. -
వాటర్‌గ్రిడ్‌పై బాబు కుట్ర
జడ్చర్ల: గొంతెండిన పాలమూరు జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి ఉత్తరాలు రాస్తూ అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లూరు వద్ద కృష్ణా నది నుంచి వాటర్‌గ్రిడ్‌కు 19 టీఎంసీల నీటిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ అడ్డుపుల్లలు వేస్తున్నారని దుయ్య బట్టారు. దీనిపై ఇటీవల ఏపీ సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీడబ్ల్యూసీకి లేఖ రాశారని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పైలాన్ ఆవిష్కరించి వాటర్‌గ్రిడ్ పథకానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా.. తెలంగాణకు సం బంధించి కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. 900 టీఎంసీల గోదావరి జలాలను, 300 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ వినియోగించుకోవచ్చని కిరణ్ చె ప్పారన్నారు. 1,200 టీఎంసీల్లో తాగునీటి అవసరాలకు 120 టీఎంసీలు వినియోగించుకునే హక్కు ఉందన్నారు. అయితే ప్రస్తుతం వాటర్‌గ్రిడ్ ద్వారా 40 టీఎంసీలను మాత్రమే తీసుకుంటున్నామన్నారు. రెండేళ్లలో ఇంటింటికీ తాగునీరు: రాష్ట్రంలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా 10 జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు కృష్ణానదిపై 26 చోట్ల నీటిని తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో పాత పైపులై న్లను తొలగించి 1.50 లక్షల కి.మీ. పేర కొత్త పైపులైన్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. 18,900 వాటర్ ట్యాంకులు నిర్మిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండేళ్లలో వాటర్‌గ్రిడ్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ తాగునీళ్లు అందిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ టెక్నికల్ బిడ్లకు ప్రభుత్వ ఆమోదం
హైదరాబాద్ : తెలంగాణ వాటర్ గ్రిడ్ రెండో దశ టెక్నికల్ బిడ్ల వ్యవహారంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 10 ప్యాకేజీలకు టెక్నికల్ బిడ్లను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ 10 ప్యాకేజీలకు సంబంధించిన ప్యాకేజీ పనులకు 44 కంపెనీలు అర్హత సాధించాయి. రాష్ట్రమంతటా నీటిని అందించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం విదితమే. -
వాటర్‌గ్రిడ్ టెండర్లకు నోటిఫికేషన్
* తొలి విడతగా 11 ప్యాకేజీలకు.. * రూ. 15,987 కోట్ల విలువైన పనులకు టెండర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి పథకం (వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు టెండర్ల నోటిఫికేషన్‌ను గ్రామీణ నీటి సరఫరా అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 26 ప్యాకేజీలుగా విభజించగా.. తొలివిడతగా 11 ప్యాకేజీలకు టెండర్లను పిలిచారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,568 కోట్లు కాగా.. రూ.15,987 కోట్ల విలువైన పనులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 27 నుంచి ఆగస్టు 11 వరకు ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ (www. eprocurement.gov.in)లో టెండర్ డాక్యుమెంట్, రశీదు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 11న సాయంత్రం 5.15 గంట లకు టెక్నికల్ బిడ్లను, 14న ఉదయం 11.30కు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. జిల్లాల వారీగా టెండర్ల ప్రక్రియను ఆయా జిల్లాల్లోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించనున్నారు. -
రూటు మారిన పైప్‌లైన్
గజ్వేల్ మంచినీటి పథకం డిజైన్‌లో మార్పులు గజ్వేల్ పట్టణానికి మంచి నీటిని అందించే పథకం పలు మలుపులు తిరుగుతోంది. ఇటీవల మార్చిన డిజైన్‌ను తాజాగా మరోమారు సవరించారు. ఈసారి చేసిన భారీ మార్పులతో గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తానికి తాగునీరు అందనుంది. నీటి పథకం.. వాటర్‌గ్రిడ్ పరిధిలోకి వెళ్లనుంది. - గజ్వేల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న గజ్వేల్ మంచినీటి పథకం డిజైన్ మారింది. గోదావరి సుజల స్రవంతి పథకం నుంచి నీటిని ట్యాపింగ్ చేయాలనే ఆలోచనకు స్వస్తి పలికారు. అలాచేస్తే నీటి సరఫరా సక్రమంగా సాగదని భావిస్తున్నారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న భారీ సంప్ నుంచే నీటి పైప్‌లైన్ ద్వారా.. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ సమీపంలోని జబ్బాపూర్ అడవుల్లోకి తెస్తారు. అక్కడ భారీ జీఎల్‌బీఆర్, ఓహెచ్‌బీఆర్‌లను నిర్మించి గ్రావిటీ ద్వారా గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరందించాలనే ఆలోచనతో ఉన్నారు. గజ్వేల్ నగర పంచాయతీలో నెలకొన్న మంచినీటి సమస్యకు తెరదించేందుకు సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకురావాలని తొలుత భావించారు. ఇందుకోసం రూ.150 నుంచి రూ.200 కోట్లు అవసరమని అం చనా వేశారు. సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీ రు తేవడం వ్యయభారమే కాకుండా ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్లాది రూపాయల కరెంట్ బిల్లులను భరించాల్సి వస్తుందని గుర్తించారు. ‘సాక్షి’ వరుస కథనాలతో మార్పులు ఈ ప్రాంతం నుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్‌లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకం నీటిని మళ్లిస్తే.. సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. ఈ విషయం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది. ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు అందడంతో ‘గోదావరి’ పథకానికి అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్‌లైన్ ద్వారా తీసుకురానున్నారు. తొలుత శామీర్‌పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్‌ను ట్యాప్ చేయాలని భావించారు. లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్‌లైన్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుందని తాజాగా యోచిస్తున్నారు. ఆ తర్వాత లింగారెడ్డిపేట పైప్‌లైన్ ట్యాపింగ్‌తోపాటు నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ, భూముల సేకరణ తదితర పనుల కోసం రూ.60 కోట్లు ప్రతిపాదించారు. వీటికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గతేడాది నవంబర్‌లో నగర పంచాయతీ పాలకవర్గం సమావేశమై పనులకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. కానీ లింగరాజ్పేట వద్ద ట్యాపింగ్ చేస్తే ప్రెషర్ సరిపోక గజ్వేల్‌కు గ్రావిటీ ద్వారా నీటిని అందించడం కష్టమవుతుందని గోదావరి పథకం నిపుణులు సూచించారు. వారి సూచన మేరకు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తాజా మార్పులు ఇలా... కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద నిర్మించనున్న భారీ సంప్ నుంచే పైప్‌లైన్ ద్వారా నీటిని ఎత్తయిన ప్రదేశంలో ఉన్న జబ్బాపూర్ అడవుల్లోకి తేనున్నారు. అక్కడ భారీ జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మించి గ్రావిటీ ద్వారా గజ్వేల్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరందిస్తారు. ఈ పనులను ‘వాటర్‌గ్రిడ్’లో చేర్చనున్నారు. గజ్వేల్ మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంకు నుంచి మంజూరైన రూ.60 కోట్లను పట్టణంలోని సంప్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ పనులకు వినియోగించనున్నారు. అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లి నుంచి కోమటిబండ వరకు చేపట్టే పైప్‌లైన్ పనులకు ‘వాటర్‌గ్రిడ్’ నిధులను వినియోగించనున్నారు. మంచినీటి పథకం మార్పుల విషయాన్ని గజ్వేల్ ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ రాజయ్య ‘సాక్షి’కి ధ్రువీకరించారు. -
'ఆ పథకాలు కార్యకర్తల కోసమే'
కరీంనగర్: కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఈ పథకాలన్నీ అవినీతిమయమని, ఆంధ్రా గుత్తేదారులతో కేసీఆర్ మిలాఖత్ ఆయ్యారన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా కలెక్టర్లు, ఇతర ముఖ్య యంత్రాగాన్ని హైదరాబాద్‌కు తరలించి సదస్సులు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని తప్పుబట్టారు. పంట నష్టంపై సర్వే చేసి తక్షణమే నివేదిక పంపితే పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఎకరాలకు సాగునీరు, పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లు వంటి హామీలు ఏమయ్యాయని నాగం ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడని అన్నారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని విమర్శించారు.