యూపీలోనూ వాటర్‌గ్రిడ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వెల్లడి
ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంస
త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని స్పష్టం
యూపీలో అఖిలేశ్‌తో సమావేశమైన కేటీఆర్
వాటర్‌గ్రిడ్‌పై మంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కొనియాడారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కోట్లాది మంది దాహార్తి తీర్చే బృహత్ పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ ఆహ్వానం మేరకు గురువారం లక్నో వెళ్లిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అధికారుల బృందానికి అక్కడి అధికారులు సాదర స్వాగతం పలికారు. అఖిలేశ్‌తో పాటు ఆ రాష్ట్ర అధికారులతో కేటీఆర్ బృందం సమావేశమైంది.
వాట ర్‌గ్రిడ్ ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని గ్రామాలన్నిటికీ మూడున్నరేళ్లలో నల్లా ద్వారా సురక్షిత మంచి నీరందించడమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమని చెప్పారు. నీరివ్వలేని పరిస్థితి తలెత్తితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రాజెక్ట్‌లో భాగంగా 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించామని మంత్రి చెప్పారు. పైప్‌లైన్‌ల ఏర్పాటు సమయంలోనే ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్స్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నట్లు తెలిపారు. రుణాలిచ్చేందుకు హడ్కో, నాబార్డ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకు వచ్చాయని చెప్పారు.
తెలంగాణలో పర్యటిస్తా: అఖిలేశ్ యాదవ్
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ తీరుతెన్నుల గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణకు వస్తానని అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేపడతామని, సాంకేతిక సహాయం అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. యువకుడు అయినప్పటికీ మంత్రిగా కేటీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆ రాష్ట్ర జల నిగమ్ మేనేజింగ్ డెరైక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ములాయంతోనూ కేటీఆర్ భేటీ
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇచ్చిన విందు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాలపై కొద్దిసేపు ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ లో బృహత్తర పథకాల అమలు పట్ల మంత్రి కేటీఆర్ చొరవను ములాయంసింగ్ యాదవ్ మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.