ఏప్రిల్ 30లోపు తాగునీరివ్వాలి
వాటర్‌గ్రిడ్‌పై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
నిర్ణీత సమయంలో పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం ప్రోత్సాహకం
శరవేగంగా ఇంటింటికీ నల్లా నీరు అందించాలి
పైపులైన్ల అనుమతులకు ప్రత్యేకంగా డీఎఫ్‌వో
వాటర్‌గ్రిడ్ పనులపై ఐదు గంటలపాటు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత సమయంలో వాటర్‌గ్రిడ్ పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల్లో 1.5 శాతం అదనపు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే పైపులైన్ ద్వారా అనుసంధానమయ్యే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోగా మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా సాధించడానికి ప్రత్యేకంగా డీఎఫ్‌వోను నియమించాలని అటవీ శాఖకు సూచించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేయడానికి అనుగుణంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారమిక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో వాటర్‌గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి ఐదు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష జరిపారు.
జిల్లాల వారీగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడి స్థానికంగా ఉండే ఇబ్బందులకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఇన్‌టెక్ వెల్స్ నిర్మాణం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులపైనే ఉందని, అందుకే నీటి సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద త్వరితగతిన అనుమతులిచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
నా పొలం నుంచే పైపులైన్ పోతోంది
వాటర్‌గ్రిడ్ ప్రాధాన్యాన్ని గుర్తించి పనుల్లో వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే.. ఓట్లు అడగబోమని తాను మాట ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇంటింటికీ నల్లా నీటిని ఇచ్చే ఈ పథకంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పారు. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం ఆరు అడుగుల లోతున పైపులైన్ వేయాలని, ఇది ఎవరి భూముల నుంచైనా వేసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో వేసే పైపులైన్ తన వ్యవసాయ భూమి (ఎర్రవెల్లి ఫామ్) నుంచే పోతోందని చెప్పారు. సీఎం మెదలుకుని ఎవరూ చట్టానికి అతీతులు కాదని అధికారులకు చెప్పారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేలా పనులు చేయాలని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పథకాలంటే పది, పదిహేనేళ్లు సాగదీసే అలవాటు ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ పద్ధతి పూర్తిగా మారాలి. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది. వీటిని అనుకూలంగా మలుచుకొని పనుల్లో వేగం పెంచాలి’’ అని చెప్పారు.
పరస్పర సహకారం ఉండాలి
రైల్వేశాఖ, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల ముఖ్య అధికారులను కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పరస్పర సహకారంతో ముందుకు పోవాలని వారిని సీఎం కోరారు. విద్యుత్ శాఖ చేస్తున్న ప్రయత్నాలను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, సీనియర్ అధికారులు, వివిధ జిల్లాల అధికారులు, వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.