రెండు తరాలు నిలవాలి | no corruption take place in double bedroom homes project | Sakshi
Sakshi News home page

రెండు తరాలు నిలవాలి

Published Wed, Oct 14 2015 3:08 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

రెండు తరాలు నిలవాలి - Sakshi

రెండు తరాలు నిలవాలి

 కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో డబుల్ బెడ్రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
 అవినీతికి తావు లేకుండా  ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
 ఈ ఏడాది 60 వేల ఇళ్లు కడదాం
 గ్రామాల్లో 36 వేలు, పట్టణాల్లో 24 వేలు నిర్మించాలి
 ఎమ్మెల్యేలు, మంత్రులు చెరో 50% మంజూరు చేస్తారు
 తప్పు దొర్లితే ఎంతటివారికైనా శిక్ష తప్పదు
 కరువు బారిన పడిన రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు
 డిసెంబర్ 31లోగా చెరువుల పనులు మొదలవ్వాలి

 
 సాక్షి, హైదరాబాద్:
 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘‘గతంలో పేదలకు ఇళ్లు అనగానే ఊరికి దూరంగా, విసిరేసినట్టుగా నిర్మించారు. డబ్బాల్లాంటి ఆ ఇండ్లలో ఎవరూ నివాసం ఉండటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిర్మించనున్న గృహాలు నిరుపేద కుటుంబాలకు రెండు తరాలకు పనికొచ్చేలా ఉండాలి. పేదల ఆత్మగౌరవం కాపాడేలా వాటిని నిర్మించాలి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ కార్యక్రమంలో కీలకంగా పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మహమూద్ అలీ ప్రారంభోపన్యాసం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాజెక్టులకు భూ సేకరణ, వాటర్‌గ్రిడ్, కరువు పరిస్థితులపై సీఎం ఈ సందర్భంగా సమీక్ష జరిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటంలో కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని సూచించారు. ‘‘పైలట్ ప్రాజెక్టుగా ముందుగా అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున ఇండ్లను కట్టాలి. వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచుతాం. ఈ ఏడాది 60 వేల ఇళ్లు కడదాం. గ్రామీణ ప్రాంతాల్లో 36 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లు కడతాం’’ అని సీఎం ప్రకటించారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.3 లక్షలు ఖర్చవుతుందన్నారు. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే
 ఈ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్ల నమూనాలను అధికారులకు సీఎం చూపించారు.
 
 అర్హులనే ఎంపిక చేయండి
 ఇళ్లను ప్రతి  నియోజకవర్గంలో 50 శాతం ఎమ్మెల్యే, 50 శాతం జిల్లా మంత్రి మంజూరు చేస్తారని సీఎం పేర్కొన్నారు. అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. ‘‘తహశీల్దార్లు ఇచ్చే సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. తప్పు దొర్లితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. జాబితాలను కలెక్టర్లు సూపర్‌చెక్ చేయాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ చేయండి. కాలనీలకే ప్రాధాన్వమివ్వండి. ప్రభుత్వ భూమిని వినియోగించండి. అవసరమైతే... మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని వాడొద్దనే నిబంధనలు సడలిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాలున్న వారిలో గృహ నిర్మాణానికి అర్హులైన వారిని గుర్తించాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. నిబంధనల సాకుతో  నిర్మాణాలు ఆపొద్దని, అవసరమైన మినహాయింపులు ఇస్తామని చెప్పారు. నిర్మాణాలకు ఇసుక తెచ్చుకునేందుకు సులభంగా అనుమతులివ్వాలని సూచించారు. ‘‘గతంలో గృహ నిర్మాణ కార్యక్రమంలో ఒకే ఏడాదిలో రూ.5 వేల కోట్ల అవినీతి జరిగింది. 300 మంది అధికారులు సస్పెండయ్యారు. కొందరు జైలుకెళ్లారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రావద్దు’’ అని స్పష్టం చేశారు. ‘‘అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా పని చేయాలి’’ అని అధికారులను హెచ్చరించారు.
 
 రైతులను ఆదుకునే కార్యక్రమాలు
 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాల నివేదిక తయారు చేయాలని వర్షాభావ పరిస్థితులపై చర్చ సందర్భంగా సీఎం ఆదేశించారు. దానివల్ల కొన్ని మండలాలే కరువు జాబితాలోకి వస్తాయని అధికారులు చెప్పారు. దాంతో, కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు.
 
 వేగంగా ప్రాజెక్టుల భూసేకరణ
 నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కలెక్టర్లు చొరవ చూపాలని సీఎం అన్నారు. ప్రాజెక్టులపై ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని, వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతుల భూమికి, ఇంటికి, పశువుల కొట్టానికి వెల కట్టి ఒకేసారి డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఖర్చయ్యే రూ.5.04 లక్షలు చెల్లించాలన్నారు. సాగునీటికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నందున డబ్బుల సమస్య లేదన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోందంటూసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 రైట్ ఆఫ్ వే ప్రయోగించండి
 వాటర్‌గ్రిడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, వాటిని కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కోరారు. ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణాలు బాగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పైపులైన్లు వేసేందుకు రైటాఫ్ వే చట్టాన్ని వాడుకోవాలన్నారు. ప్రాజెక్టు పూర్తి కావద్దనే ఉద్దేశంతో కొందరు తమ భూముల్లోంచి పైపులైన్లు వద్దని అడ్డుకుంటున్నారన్నారు. 1.6 మీటర్ల లోతున పైపులైన్ వేస్తున్నందున నష్టమేమీ ఉండదని, అందుకే కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 13,550 చోట్ల రైల్వే లైన్లు, రహదారులు, కాల్వలను పైపులైన్లు క్రాస్ చేయాల్సి వస్తుందని, వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు.
 
 డిసెంబరు 31లోగా చెరువుల పనులు
 మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులు డిసెంబర్ 31లోగా ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. మొదటి విడతలో ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని, రెండో విడతకు ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఫీడర్ ఛానళ్ల మరమ్మతులు చేయాలన్నారు. చెరువులు కబ్జాలకు గురవకుండా కఠిన చట్టాలు తెస్తామని చెప్పారు. చెరువుల కింద ఆయకట్టు నిర్ధారణకు సర్వేలు నిర్వహించాలన్నారు. నదులు, ఉపనదులు, కాల్వలపై నిర్మించే వంతెనలను చెక్‌డ్యామ్‌లుగా ఉపయోగపడేలా కట్టాలని చెప్పారు.
 
 ఇబ్బందికర నిబంధనలలొద్దు
 దళితులకు మూడెకరాల భూ పంపిణీకి అధికారులు మరింత చొరవ చూపాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలున్న భూములే కొనివ్వాలనే నిబంధనను తొలగించాలన్నారు. కొనుగోలుకు ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలు మార్చాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా ఎస్టీలకు వ్యవసాయ భూమి సమకూర్చాలని, ఆర్థిక స్వావలంబన పథకాన్ని ఎక్కువ మందికి ఉపయోగపడేలా అమలు చేయాలని అన్నారు. జీవో నం.58, 59 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామజ్యోతి ద్వారా అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. చెత్త సేకరణకు త్వరలోనే 25 వేల ట్రై సైకిళ్లు అందజేస్తామని వెల్లడించారు. చేంజ్ ఏజెంట్లతో కలెక్టర్లు నిరంతరం సమావేశాలు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు సామాజిక మార్పులో పోలీసు శాఖ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
 
 సిరిసిల్ల, సిద్దిపేట ఆదర్శం
 రాష్ట్రంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం నిర్వహించాలని సీఎం అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు పెంచాలని, సామాజిక అడవులు పెంచాలని అన్నారు. ఫైరింజన్ల ద్వారా మొక్కలకు నీరు పోయాలన్నారు. అటవీ భూముల రక్షణకు, కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే వ్యూహం రూపొందించుకోవాలని సూచించారు. నల్లమల అడవుల్లోని షెడ్యూలు తెగల కుటుంబాల పునరావాసానికి కార్యాచరణ రూపొందించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలను ఉపాధి హామీ నిధులతో పూర్తి చేయాలన్నారు. మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement