
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే దమ్ముందా?
బీజేపీకి మంత్రి తలసాని సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంది. తమ పార్టీ ఎంపీలు అండగా వస్తారు, బీజేపీకి బిల్లు పెట్టే దమ్ముందా..’ అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఇప్పటికే తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది పనిచేసే ప్రభుత్వం కాబట్టే, ప్రజలు తప్పకుండా అడుగుతారన్నారు.
కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, కానీ, ఏపీని ఒకలా, తెలంగాణను మరొకలా చూస్తోందని మండిపడ్డారు. అర్బన్ హౌసింగ్‌లో ఏపీకి 1.93 లక్షల ఇళ్లు కేటాయిస్తే, తెలంగాణకు ఇచ్చింది కేవలం 10 వేలేనని, ఇక బీజేపీ నేతలకు మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
రుణమాఫీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని అప్పు ఇవ్వాలని కోరితే దానికి ఇప్పటివరకు స్పందన లేదని, మళ్లీ బీజేపీ నేతలే రుణమాఫీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఆశావర్కర్ల సమస్య కేంద్ర పరిధిలో ఉందని, ఈ సమస్య పరిష్కారానికి మంత్రి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కేంద్రంతో ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు.