నకిలీ కరెన్సీ నోట్లతో మైనర్ బాలుడు అరెస్ట్
పాట్నా: నకిలీ కరెన్సీ నోట్లతో మైనర్ బాలుడు పట్టుబడడం బీహార్లో సంచలనం రేపింది. తూర్పు చంపారన్ జిల్లాలో ఓ బాలుడు రూ.1.06 లక్షల దొంగ నోట్లతో పట్టుబడ్డాడు. నకిలీ కరెన్సీ నోట్లు కలిగివున్న14 ఏళ్ల బాలుడిని గురువారం రాత్రి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యు ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేశారు. సిలిగురి నుంచి మొతిహరికి బస్సులో వెళుతుండగా అతడిని పట్టుకున్నారు.
దొంగ నోట్లతో మైనర్ బాలుడు పట్టుబడడంతో అధికారులు అవాక్కయ్యారు. నకిలీ నోట్లతో మైనర్ అరెస్ట్ కావడం బీహార్లో ఇదే మొదటిసారని వెల్లడించారు. దొంగనోట్ల ముఠాలు పిల్లలను పావులుగా వాడుకుంటున్నాయని అనుమానిస్తున్నారు. అరెస్టయిన మైనర్ బాలుడిని అధికారులు ప్రశ్నించారు.
గత కొన్ని నెలలుగా పలుమార్లు నకిలీ నోట్లు తరలించినట్టు విచారణలో అతడు వెల్లడించాడు. పలు దొంగనోట్ల ముఠాలకు ఈ వ్యవహారంలో సంబంధమున్నట్టు గుర్తించారు. 'దాదా'గా పిలవబడే వ్యక్తి తనకు దొంగనోట్లు ఇచ్చినట్టు నిందితుడు చెప్పడంతో ఈ దిశగా అధికారులు దృష్టి సారించాడు.