లాలూ కుమార్తెకు జరిమానా
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపన్ను శాఖ తాజాగా సమన్లు జారీ చేసింది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మిసా భారతి భర్త శైలేశ్‌కుమార్ రేపు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు అధికారి ముందు హాజరుకానున్నారు. రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఈరోజు విచారణ అధికారి ముందు మిసాభారతి హాజరుకావాల్సివుంది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో రూ. 10 వేలు జరిమానా విధించింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా దర్యాప్తు అధికారి తిరస్కరించారు.
లాలూ తనయ, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో గత నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వీరి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు మే 22న అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా భారతి, శైలేశ్‌లకు ఆదాయపన్ను శాఖ సమన్లు జారీ చేసింది.