కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత ఐదురోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షను గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను పోలీసులు దీక్షాప్రాంగణం నుంచి నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను నెట్టి వేసి ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా, ప్రశాంతంగా కొనసాగిస్తున్న దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుపట్టారు.
తెలంగాణకు అనుకూలంగా ఉన్నా రా? అంటూ పోలీసులపై నాయకులు విరచుకుపడ్డారు. తమ నాయకుని తీసుకెళ్లేందుకు వీల్లేదని అడ్డుకున్నా, అందరినీ చెదరగొట్టి ప్రత్యేకంగా వచ్చిన బెటాలియన్ పోలీసులను రంగంలోకి దిం ప్రసన్నకుమార్‌ను పోలీసుల వాహనంలో తరలించారు. తమ నాయకుడ్ని బలవంతంగా తీసుకెళ్లడం సహించని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, కోవూరు జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు.