
ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి
ఏపీ సర్కారుకు ధైర్యం ఉంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని, ఫలితం ఎలా ఉంటుందో చూడాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాలు చేశారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతుల పిటిషన్లో న్యాయం ఉందని కోర్టు భావించినందువల్లే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు.
ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం ఎందుకు దగా చేసిందని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని డిసెంబర్ నెలలోనే ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. మేథాపాట్కర్, అన్నాహజారే, శివరామకృష్ణన్ తదితరులు ఏ పార్టీకి చెందినవారని ఆర్కే నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ప్రభుత్వం గనక భూసేకరణ చట్టం ప్రయోగిస్తే.. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.