యూపీఏ ప్రభుత్వం కూడా ఈ దాడులు చేసిందట!
పాకిస్తాన్ భూభాగంలో భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ను ప్రత్యర్థిపార్టీ కాంగ్రెస్ ఓ వైపు మెచ్చుకుంటూనే, మరోవైపు ఆధారాలు బయటపెట్టమని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
న్యూఢిల్లీ : పాకిస్తాన్ భూభాగంలో భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ను ప్రత్యర్థిపార్టీ కాంగ్రెస్ ఓ వైపు మెచ్చుకుంటూనే, మరోవైపు ఆధారాలు బయటపెట్టమని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. యూపీఏ ప్రభుత్వం కూడా నిర్దేశిత దాడులు జరిపిందని, ప్రస్తుతం పాకిస్తాన్కు వ్యతిరేకంగా మిలటరీ జరిపిన ఆ దాడులకు సబంధించిన తగిన ఆధారాలను బయటపెట్టాలని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. బుధవారం అర్థరాత్రి జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉడి ఉగ్రదాడికి ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం జరిపిన ఈ దాడులను రాజకీయాలకతీతంగా కొనియాడుతున్నారు.
కానీ మొదటిసారేమీ ఆర్మీ నియంత్రణ రేఖను దాటివెళ్లలేదని, ఇదేమాదిరి అతిపెద్ద దాడి 2013లో జనవరిలో యూపీఏ హయాంలో జరిగిందని చిదంబరం అన్నారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించలేదని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్పై రాజకీయ యాజమాన్యమంతా ఎన్డీయే ప్రభుత్వం స్వాధీనం పరుచుకోవలనుకోవడంపై ఆయన హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ జరిపే సర్టికల్ స్టయిక్స్కు నరేంద్రమోదీ ప్రభుత్వానికి తామందరమూ వెన్నుదన్నుగా నిలుస్తామని, కానీ మిలటరీ చర్యలకు తగిన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా డిమాండ్ చేస్తున్నారు.