
ప్రతిపక్ష నేతలను స్వయంగా పలుకరించిన మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రతిపక్ష సభ్యుల వద్దకు వెళ్లి పలుకరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా గ్రీటింగ్స్ తెలిపారు. సోమవారం ఉదయం సభ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే లోక్‌సభకు వచ్చిన ప్రధాని మోదీ ప్రతిపక్షాల బెంచ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి.. ప్రతిపక్ష నేతలను పలుకరించారు.
ప్రథమ వరుసలో కూర్చున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై, సోనియాగాంధీలను పలుకరించారు. గౌడ, ములాయం, ఖర్గే, తంబిదురైలతో కరచాలనం చేసిన మోదీ.. సోనియాకు చేతులు జోడించి ప్రణామం తెలిపారు. రెండో వరుసలో కూర్చున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సింథియాలను కూడా ప్రధాని మోదీ పలుకరించారు. సభలోకి వచ్చే సమయంలో చేతులు జోడించి సభ్యులకు ఆయన ప్రణామం తెలిపారు. ఈ సందర్భంగా ఎల్జేపీ నేత రాంచంద్ర పాశ్వాన్ మోదీకి పాదాభివందనం చేశారు.