మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఆయనది ఎన్నికల ప్రసంగమని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ఉద్యోగాల కల్పన, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వంటి వాటికి ప్రధాని మోదీ సమాధానాలివ్వాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కేవలం కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకే సమయం మొత్తాన్నీ వృథా చేశారని రాహుల్ ఆక్షేపించారు.
మోదీ ప్రధాన మంత్రి అన్న విషయాన్ని మరిచిపోయి ప్రతిపక్ష నేతలా మాట్లాడారని రాహుల్ అన్నారు. ‘మోదీ ప్రసంగం సుదీర్ఘం. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకున్నారు. రాఫెల్ ఒప్పదంపై మోదీ తన నిశ్శబ్దాన్ని ఛేదించి ఇంకెప్పుడు మాట్లాడతారు?’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ ‘ప్రజలకు ఉద్యోగాలు కావాలి. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని వారు ఆశపడ్డారు. కానీ ఆయన ఉద్యోగ కల్పన, రైతు సమస్యలు తదితర వేటినీ పట్టించుకోలేదు’ అని విమర్శించారు.
విపక్షాల వాకౌట్
మరోవైపు రాఫెల్ ఒప్పందం నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వరకు తమ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా మోదీ సమాధానం ఇవ్వలేదంటూ విపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. మోదీ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయా పార్టీల సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ కేటాయించాలనీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలనీ, రాఫెల్ ఒప్పందం వివరాలు బయటపెట్టాలంటూ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment