గౌడతో అఫైర్‌పై మైత్రీయ సినిమా
బెంగళూరు: కేంద్ర న్యాయశాఖ మంత్రి జస్టిస్ డీవీ సదానంద గౌడ కుమారుడు కార్తీక గౌడతో నడిచిన తన ప్రేమ కలాపాలను ఇతి వృత్తంగా 'తీసుకొని నిర్మిస్తున్న సినిమాలో కన్నడ వర్ధమాన తార మైత్రీయ గౌడ స్వయంగా నటిస్తున్నారు. 'అక్షితే' పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కార్తీక గౌడ, తాను చెట్టూ పుట్ట పట్టుకొని ప్రేమించుకున్నామని గతేడాది రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని మైత్రీయ గౌడ పబ్లిగ్గా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
తనను కార్తీక గౌడ నమ్మించి మోసం చేశారనే ఆమె ఆరోపణలపై బెంగళూరు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుపుతున్నారు. అయితే ఎంతో పరువు ప్రతిష్టలు, పలుకుబడి కలిగిన నిందితుడిపై ఇంతవరకు చార్జిషీటు దాఖలు చేయలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు వచ్చినప్పుడు దీనిపై మైత్రీయ నానా రాద్ధాంతం కూడా చేసింది. చివరకు ఆమెను మహిళా పోలీసుల ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది.
'అక్షితే' చిత్రానికి పెద్దగా పేరులేని రాజ్, కార్తీక్ శెట్టీ లాంటి వారిని ఎంపిక చేసుకున్నారు. అందులో హీరో పాత్రకు కూడా కార్తీక్ అనే పేరే ఖరారు చేశారు. సినిమాలో కార్తీక్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగే మైత్రీయ చివరకు పెల్లి చేసుకోదని సినీ వర్గాల సమాచారం. మైత్రేయ ప్రేమాయణంనే చిత్రంగా తీస్తున్నారా లేక ఫిక్షన్ కథనా? అనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఈ పరిణామాలన్నింటిని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎప్పటికప్పుడు గమనిస్తోంది.
నిజ జీవిత పాత్రలపై చిత్రాన్ని నిర్మించాలంటే ఆ అసలు క్యారెక్టర్ల అనుమతి తీసుకోవడం తప్పనిసరని చిత్ర వాణిజ్య మండలి నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సదానంద గౌడ కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే! అవసరమైతే వారు హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తీసుకోవచ్చని హైకోర్టు న్యాయవాది ఆర్. నాథ్ చెప్పారు. మైత్రీయ ఒత్తిడి రాజకీయాల్లో భాగమే ఈ చిత్రం ఎత్తుగడని గౌడ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.