నటి మైత్రేయితో ముఖ పరిచయమే | Police question Karthik gowda over accusations by actress Maithreya gowda | Sakshi
Sakshi News home page

నటి మైత్రేయితో ముఖ పరిచయమే

Published Sat, Sep 13 2014 8:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

నటి మైత్రేయితో ముఖ పరిచయమే

నటి మైత్రేయితో ముఖ పరిచయమే

    *మైత్రేయాతో సంబంధాలపై కార్తీక్
    *పోలీసుల విచారణకు హాజరైన వైనం

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వర్ధమాన నటి, మోడల్ మైత్రేయా గౌడ ఫిర్యాదుతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అత్యాచారం, వంచన ఆరోపణల కింద మైత్రేయా చేసిన ఫిర్యాదుపై ఇక్కడి ఆర్‌టీ నగర పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాల్సిందిగా పోలీసులు రెండు సార్లు పంపిన సమన్లపై కార్తీక్ స్పందించక పోవడంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది.

అనంతరం సిటీ సివిల్ కోర్టు అతనికి ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మైత్రేయా చెబుతున్నట్లు, తాను ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడలేదని దర్యాప్తు అధికారి, ఏసీపీ ఓంకారయ్యకు కార్తీక్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. స్నేహితుల ద్వారా ఆమె పరిచయమైందని, మూడు, నాలుగు పార్టీల్లో మాట్లాడుకున్నామని, తర్వాత స్నేహంగా మారిందని వివరించారు. ఉదయం 6.15 గంటలకే ఆర్‌టీ నగర పోలీసు స్టేషన్‌కు వచ్చిన కార్తీక్, మైత్రేయా ఫిర్యాదుపై ఏసీపీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

అనంతరం అతనిని వైద్య పరీక్షల కోసం అంబేద్కర్ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. తర్వాత మళ్లీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు పరిచారు. మైత్రేయా ఫిర్యాదులోని సత్యాసత్యాలను కనుగొనడానికి ఏసీపీ అతనిని పలు విధాలుగా ప్రశ్నించారు. పసుపు కొమ్ముతో తాళి కట్టి కార్తీక్ తనను వివాహమాడాడని మైత్రేయా చేసిన ఫిర్యాదును కార్తీక్ తోసిపుచ్చారు.

స్నేహితులుగా ఫోనులో మాట్లాడుకున్న విషయాలను రికార్టు చేసుకుని మైత్రేయా కట్టు కథలు అల్లుతోందని ఆరోపించారు. మంగళూరుకు పిలిపించుకున్నానని, తామిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మైత్రేయాను స్నేహితులకు పరిచయం చేశానని... ఆమె చెబుతున్నదంతా బూటకమేనని కార్తీక్ కొట్టి పారేసినట్లు తెలిసింది.
 
కేంద్ర మంత్రిగా ఉన్న తన తండ్రిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్రలో మైత్రేయా పావుగా మారిందని ఆరోపించారు. స్నేహితురాలు కావడంతో పాటు సినీ నటి కనుక సహజంగానే ఆకర్షణ ఉంటుందని వివరణ ఇచ్చారు. తదుపరి దర్యాప్తునకు పిలిస్తే రావాలని సూచిస్తూ, దర్యాప్తు అధికారి అతనిని పంపించివేశారు. కాగా గత నెల 30న కొడగు జిల్లాలోని కుశాల నగరలో పారిశ్రామికవేత్త నాణయ్య కుమార్తె స్వాతితో కార్తీక్‌కు నిశ్చితార్థమైంది. వెనువెంటనే మైత్రేయా అతనిపై అపహరణ, అత్యాచారం, వంచన ఆరోపణల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement