రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు ఖేకిహో ఝిమోమీ హఠాన్మరణంతో.. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభ వాయిదా పడింది.
న్యూఢిల్లీ: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు ఖేకిహో ఝిమోమీ హఠాన్మరణంతో.. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభ వాయిదా పడింది. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఖేకిహో గురువారం ఉద యం గుండెపోటుతో మరణించారు. నాగాలాండ్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఖేకిహో కృషిచేశారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తెలిపారు. సభ ప్రారంభం కాగానే సిట్టింగ్ ఎంపీతోపాటు ఇటీవలమరణించిన మాజీ రాజ్యసభ ఎంపీలు రామ్ కప్సే, రుద్ర ప్రతాప్ సింగ్, ఎన్ రాజేంద్రన్‌లకు కూడా సభ నివాళులర్పించింది. రెండు నిమిషాలపాటు మౌనం వహించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు అన్సారీ తెలిపారు.
అసహనంపై చర్చకు సిద్ధం: జైట్లీ
అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘భారత్‌లో వాస్తవ భిన్నాభిప్రాయాన్నే కాదు.. కల్పిత, నకిలీ అసమ్మతినీ అనుమతించేంత స్వేచ్ఛ ఉంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనావిధానంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శలపై.. ‘మా ప్రధానమంత్రులు మోదీ కానీ, వాజ్‌పేయి కానీ అత్యంత చిన్న స్థాయి నుంచి అత్యున్నత పదవికి ఎదిగారు.
కాంగ్రెస్‌లోలా కుటుం బ పాలన ద్వారా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఒక ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఎవరైనా తమకు రక్షణ లేదని, అభద్రతగా భావిస్తే.. వారిని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.