
గర్భిణీలకు పులుపెందుకు ఇష్టమంటే..?
మహిళలు గర్భవతి అయిన కొత్తలో పులుపును ఎక్కువగా ఇష్టపడతారు. పుల్ల మామిడిపండ్లు తినే సీన్లను సినిమాల్లో గర్భవతికి ప్రతీకగా చూపడం తెలిసిందే. అయితే, గర్భవతులు పులుపును ఇష్టపడటం వెనుక దేవుడి లీల ఉందని మధ్యప్రదేశ్ మంత్రి సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ప్రెగ్నెంట్ మహిళలు పులుపును తినడం వల్ల ద్వారా వారికి ‘సీ’ విటమిన్ అంది.. రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని, దేవుడు వారికి ‘సీ’ విటమిన్ అందడం కోసమే పులుపును ఎక్కువ ఇష్టపడేలా చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.
షిల్లాంగ్‌లో ’న్యూట్రిషియన్-సెన్సిటివ్ అగ్రికల్చర్’ అంశంపై షిల్లాంగ్‌లో నిర్వహించిన సదస్సులో మధ్యప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అర్చనా చిట్నిస్ ప్రసంగించారు. ‘దేవుడు ఒక శాస్త్రవేత్తే. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగడానికి గర్భిణీ మహిళలు ఏం తినాలో దేవుడికి తెలుసు. వారికి పుల్లని పండ్ల ద్వారా ఎక్కువ ’సీ’ విటమిన్ అందాల్సి అవసరం ఉంటుంది. అందుకే దేవుడు వారికి పులుపు మీద మక్కువ కలిగేలా చేస్తాడు’ అని ఆమె వివరించారు.