నాడు ఉద్యమకారులు.. నేడు ఉగ్రవాదులా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి
ఖమ్మం: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన దీక్షకు మద్దతు పలికి.. ఆందోళనలు నిర్వహించిన పీడీఎస్ యూ విద్యార్థులు ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేస్తుంటే ఐరన్‌హ్యాండ్‌తో డీల్ చేస్తామని సీఎం హెచ్చరించడం శోచనీయం. మీ అవసరాల కోసం ఉద్యమకారులుగా కనిపించిన విద్యార్థులు, నేడు తీవ్రవాదులుగా కనిపిస్తున్నారా?’ అని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటినా తాగునీటికి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదన్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనుల పోడుభూమికి హక్కుపత్రాలను అందించగా కేసీఆర్ ఆ భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీల ఊసే లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారన్నారు.