దిగ్గజాలకు దడ పుట్టించారు...! | Multinational companies 'Eta' competition | Sakshi
Sakshi News home page

దిగ్గజాలకు దడ పుట్టించారు...!

Published Sat, Jan 18 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

దిగ్గజాలకు దడ పుట్టించారు...!

దిగ్గజాలకు దడ పుట్టించారు...!

  • బహుళజాతి సంస్థలతో ‘ఈటా’ పోటీ
  • తెలంగాణ, సీమ ఊళ్లలో ఇంటింటా ఆదరణ
  • రాష్ట్రంలో తొలి సబ్బుల తయారీ కంపెనీ ఇదే
  • రూ.10 లక్షల నుంచి 100 కోట్ల టర్నోవర్‌కు
  • త్వరలో మరిన్ని రకాల కొత్త ఉత్పాదనలు
  •  భుజాన సబ్బుల సంచీతో ఓ దుకాణానికెళ్లాడాయన. తమ డిటర్జెంట్ సబ్బు అమ్మిపెడితే మంచి కమీషన్ ఇస్తానన్నాడు. ఆయన్ను ఎగాదిగా చూసిన దుకాణదారు.. ‘‘ఏమయ్యా ఎవరు కొంటారు మీ సబ్బుని? పెద్దపెద్ద బ్రాండ్లున్న ఈ రంగంలో, కొత్త పేరుతో వచ్చిన మీ సబ్బును బంగారు నాణెం పెట్టి అమ్మనా ఎవరూ కొనరు. తెలుసా?’’ అంటూ కటువుగా చెప్పాడు. కానీ ఆయన వెళ్లలేదు. దుకాణంలో టేబుల్ తుడిచే బట్ట తీసుకున్నాడు. నిండా మసిబారి ఉన్న ఆ బట్టను తమ సబ్బుతో తానే ఉతికి చూపించాడు. అప్పటికి దుకాణదారుకు అర్థమైంది ఆ సబ్బు నాణ్యత.
     
     అర్థమయ్యాక ఇక మాట్లాడలేదు. తన సబ్బు పనితనాన్ని చూపిన వ్యక్తి  కిషోర్ చంద్ చోర్డియా. ఆ సబ్బు పేరు ఈటా. కిషోర్‌చంద్ చోర్డియాది రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన మార్వాడీల కుటుంబం. 1981 దాకా ఆయన వివిధ కంపెనీల వస్తువులకు డీలర్‌గా ఉన్నారు. అప్పుడే ఆయనకో ఆలోచన వచ్చింది. ఉత్పాదక రంగంలోకి తానెందుకు అడుగు పెట్టకూడదని!  రంగంలోకి దిగాడు. 1981లో ‘ఈటా’తో మార్కెట్లోకి వచ్చాడు. తొలి ఏడాది టర్నోవరు రూ.10 లక్షలు. ఇప్పుడది రూ.100 కోట్లను దాటిపోయింది. ఒకవైపు బహుళ జాతి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తుతూ, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా... పెద్దగా ప్రచారార్భాటం లేకుండానే ‘ఈటా’ ఇంటింటి సబ్బుగా మారింది. పెద్ద బ్రాండ్లను దీటుగా ఎదుర్కొంది. రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో ఈ పేరు తెలియని కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు.
     
     పంపిణీ నుంచి మొదలై...: 1981లో ఈ కిషోర్‌సన్స్ డిటర్జెంట్స్ కంపెనీని స్థాపించారు చోర్డియా. హైదరాబాద్ సమీపంలోని తిమ్మాపూర్‌లో కంపెనీకి ప్లాంటుంది. ఈటా బ్రాండ్‌తో తొలుత డిటర్జెంట్లు తయారు చేసిన కంపెనీ... తరవాత కొబ్బరి నూనె, వాషింగ్ పౌడర్, డిష్ వాష్ బార్‌లను ఒ క్కొక్కటిగా తెచ్చింది. అంతర్గత వనరుల ద్వారా సంస్థను విస్తరి ంచారు. కిషోర్‌చంద్ కుమారులైన సురేందర్ చంద్, మహేందర్ చంద్, గౌతమ్ చంద్, నేమి చంద్, ధరమ్ చంద్, ప్రకాశ్ చంద్‌లు కంపెనీలో ఒక్కో విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం ప్రవేశించింది. స్టీలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోనూ అడుగు పెట్టారు.
     
     ప్రత్యక్షంగా వెళ్లి...
     మొదట్లో కిషోర్ చంద్ కుమారులు చిన్న చిన్న ఊళ్లకు నేరుగా వెళ్లేవారు. బట్టలు ఉతికి చూపించి మరీ తమ సబ్బు గురించి చెప్పేవారు. అలా అన్ని దుకాణాల కు ఈటా  చేరింది. 1981లో 125 గ్రాముల ఈటా సబ్బు ధర రూ.2.20. ఇపుడది రూ.8. ‘‘దిగ్గజ కంపెనీల ప్రీమియం సబ్బులకు ఏమాత్రం తీసిపోని నాణ్యత కొనసాగిస్తున్నాం. ధర అంటారా...! పోటీ కంపెనీతో పోలిస్తే చాలా తక్కువ. నాణ్యతే మా బ్రాండ్ ఇమేజ్’’ అంటారు కంపెనీ డెరైక్టర్ గౌతమ్‌చంద్ జైన్. ‘‘ప్రీమియం బ్రాండ్‌తో పోటీపడ్డ తొలి భారతీయ కంపెనీ మాదే. రాష్ట్రంలో తొలి సబ్బుల తయారీ కంపెనీ కూడా మాదే. ముడి పదార్థాలను మేమే తయారు చేసుకుంటాం. తయారీ విధానం మాకు ప్రత్యేకం’’ అని మరో డెరైక్టర్ ప్రకాశ్ చంద్ వివరించారు.
     
     కొత్త విభాగాల్లోకి..: కంపెనీ ఉత్పత్తుల సంఖ ్య 2012 నాటికి 25 మాత్రమే. ఇప్పుడు 40కి పెరిగింది. ఈటాతో పాటు సూపర్ హిట్, ఫుల్ మూన్, న్యూ మూన్, హిట్ బ్రాండ్లు మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. రోజుకు 300 టన్నుల సబ్బులు, పౌడర్‌ను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. నెలకు 80 టన్నుల కొబ్బరి నూనె విక్రయిస్తోంది. వినియోగ వస్తువుల రంగంలో కొత్త అవకాశాలను అందుకోవడానికి మూడవ తరం రంగంలోకి దిగింది. చందనం, నిమ్మ ఫ్లేవర్‌లో ఒంటి సబ్బులను ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నట్టు సువ్రత్ చంద్ వెల్లడించారు. తిమ్మాపూర్‌లో రూ.3 కోట్లతో సబ్బుల తయారీ ప్లాంటును కొత్తగా ఏర్పాటు చేశారు. కిషోర్ చంద్ చోర్డియా ఐ సెంటర్ ద్వారా పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement