Covid Delta Variant Mutations: డెల్టా కన్నా డేంజర్‌ వేరియంట్‌ వస్తోందా? - Sakshi
Sakshi News home page

Delta Variant: డెల్టా కన్నా డేంజర్‌ వేరియంట్‌ వస్తోందా?

Published Sat, Aug 7 2021 4:28 AM | Last Updated on Sat, Aug 7 2021 12:02 PM

Delta variant is Covid-19 on steroids - Sakshi

కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు రూపుమార్చుకుంటూ కొత్త సవాళ్లను విసురుతోంది. డెల్టా వేరియంట్‌ ఉధృతి తగ్గే సమయానికి ఇతర వేరియంట్లైన ల్యామ్డా, ఈటా వంటివి డేంజరస్‌గా మారే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వేరియంట్ల వ్యాప్తిపై డబ్లు్యహెచ్‌ఓ కన్నేసి ఉంచింది. ఎలాంటి టీకాకు లొంగకుండా, కార్చిచ్చులాగా వ్యాపిస్తూ, ప్రజలను తీవ్ర అనారోగ్యం పాలు చేసే వేరియంట్‌ రెడీ అవుతోందనేందుకు ఛాన్సులు తక్కువేగానీ, అస్సలు లేవని చెప్పలేమని న్యూస్‌వీక్‌ రిపోర్ట్‌ తాజా నివేదిక అభిప్రాయపడింది. అలాంటి వేరియంట్‌ ఎదురైతే ప్రస్తుత ముప్పునకు మూడురెట్లు అధిక ముప్పుండొచ్చని అంచనా వేసింది. అలాంటి వేరియంట్‌ను స్టిరాయిడ్స్‌(అధికశక్తిని ప్రేరేపించే రసాయనాలు) తీసుకున్న అథ్లెట్లతో పోలుస్తూ ‘స్టిరాయిడ్‌ తీసుకున్న డెల్టా’గా నివేదిక అభివర్ణిస్తోంది.  

టీకాలే శరణమా?
పైన లెక్క ప్రకారం చూస్తే ఎంత తక్కువగా మ్యుటేషన్‌ చెందినా ఈ పాటికి కరోనా డేంజర్‌ వేరియంట్ల సంఖ్య ఎక్కువగానే ఉండాలనే డౌట్‌ వస్తుంది. అయితే ప్రతి మ్యుటేషన్‌తో వచ్చే వేరియంట్‌ డేంజర్‌ కాకపోవచ్చని, ఉద్భవించిన కొత్త వేరియంట్‌ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందిందనే అంశంపై ఆధారపడి దాని ప్రభావం ఉంటుందని పరిశోధన వెల్లడించింది. అంటే సంవత్సరం పాటు ఒక వేరియంట్‌ కొద్దిమంది జనాభాలో వ్యాప్తి చెందుతుంటే వచ్చే ప్రమాదం కన్నా కోట్లాదిమందిలో సోకిన వేరియంట్‌ వ్యాప్తి తీవ్రత కారణంగా అత్యంత ప్రమాదకారిగా మారుతుంది.

అంటే మనిషి శరీరమే కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకకు ల్యాబ్‌లాగా పనిచేస్తుందన్నమాట. ముఖ్యంగా టీకా తీసుకోని జనాభా ఎక్కువగా ఉన్న చోట వ్యాపించే వేరియంట్‌ అంత్యంత డేంజరస్‌గా మారుతుందని నివేదిక తెలిపింది. కేవలం మాస్కులు, సామాజిక దూరంతో కొత్త వేరియంట్ల సృష్టిని ఆపలేమని, టీకాలు తీసుకోవడం ద్వారానే దీనికి అడ్డుకట్టవేయగలమని మరో సైంటిస్టు ప్రీతి మాలిని అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే డెల్టా కన్నా డేంజర్‌ వేరియంట్‌ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉన్న దేశాల్లో డెల్టా విజృంభణకు ఇదే కారణమని నిపుణులతో పాటు డబ్లు్యహెచ్‌ఓ భావిస్తోంది. అందుకే దేశాలన్నీ టీకా కార్యక్రమ వేగాన్ని పెంచాలని కోరుతోంది.   

ఎందుకింత ప్రమాదకరం?
నిజానికి ఇతర జీవులతో పోలిస్తే కరోనా వైరస్‌లో జన్యుపదార్ధం చాలా స్వల్పం. మొత్తం కలిపితే 15 జీన్స్‌ ఉంటాయి. మనిషి కణంలో 20వేల జీన్స్‌ ఉంటాయి. దీన్ని బట్టి కరోనా జన్యుపదార్ధ సైజు అర్దం చేసుకోవచ్చు. అలాగే దీని ఉత్పరివర్తనాల రేటు(రేట్‌ ఆఫ్‌ మ్యుటేషన్‌) చాలా తక్కువ. పది రిప్లికేషన్ల(ప్రతికృతి)కు ఒకసారి ఈ వైరస్‌ జీన్స్‌ మ్యుటేషన్‌ చెందుతాయి. మరలాంటప్పుడు కరోనా కొత్త వేరియంట్లు ఒకదాని కన్నా ఒకటి డేంజర్‌గా ఎందుకు మారుతున్నాయన్న ప్రశ్న వస్తుంది.

ఇతర వైరస్‌లతో పోలిస్తే జన్యుపదార్ద రిప్లికేషన్‌లో తప్పిదాలు జరగకుండా ఉత్పరివర్తనం(మ్యుటేషన్‌) చెందే సామర్థ్యం కరోనా సొంతమని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర వైరస్‌లతో పోలిస్తే ఇది సోకిన వ్యక్తిలో ఉత్పత్తయ్యే వైరస్‌ల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో ఒకసారి మ్యుటేషన్‌ పొందిన అనంతరం కొత్త వేరియంట్‌ సోకిన మనిషిలో దీని లోడు చాలా ఎక్కువ. దీంతో సదరు రోగి కోట్లాది మ్యుటేడెడ్‌ వైరస్‌లను ఒక్కరోజులో ఉత్పత్తి చేస్తుంటాడు. ఉత్పరివర్తన రేటు తక్కువైనా కొత్తగా పుట్టు కొచ్చే వైరస్‌ సంఖ్య చాలా ఎక్కువ కావడంతో డేంజర్‌ వేరియంట్‌ ఆవిర్భావం జరుగుతోందని తెలిపింది.
 – నేషనల్‌డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement