డ్రగ్స్ కేసులో రేపటి నుంచి సినీ నటుల విచారణ
హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు జారీ చేసిన సినీ నటులను రేపటి (బుధవారం) నుంచి, ఈ నెల 27 వరకూ రోజుకొకరిని విచారణ చేస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ నటి ముమైత్ ఖాన్ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారని తెలిపారు. డ్రగ్స్ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు.
కాగా డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడటంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసింది.
ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న హీరోయిన్ ఛార్మీ, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామెన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ను ఫేస్ చేయబోతున్నాడు. 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. కాగా ఓ టీవీ చానల్‌లో బిగ్ బాస్ కార్యక్రమంలో ముమైత్ ఖాన్ బిజీగా ఉండటంతో ఆమె స్వయంగా సిట్ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది.