ప్రేమికులకు ఇక గడ్డుకాలం!
వాళ్లంతా ప్రేమికులు లేదా కాబోయే భార్యాభర్తలు. ముంబై నగరంలోని వేర్వేరు హోటళ్లకు జంటలుగా వెళ్లారు. అక్కడ ఉన్న వాళ్లను మాల్వానీ పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వాళ్లపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ అంశం ముంబై మహానగరంలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. తామంతా మైనారిటీ తీరినవాళ్లమేనని, తమకు నచ్చిన వ్యక్తితో ఎక్కడో హోటల్ గదిలో తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటే దానికి పోలీసులకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదేమీ బహిరంగ ప్రదేశం కాదుకదా అని మండిపడుతున్నారు.
పోలీసులు దాదాపు 40 వరకు జంటలను అరెస్టు చేయగా, వాళ్లలో చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్లు వెళ్లాయి. ఒక్కొక్కరికి దాదాపు రూ. 1200 జరిమానా విధించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల అమ్మాయి దాదాపు ఆత్మహత్య చేసుకున్నంత పని చేసింది.
తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినందుకు మరో 21 ఏళ్ల అమ్మాయిని లేడీ కానిస్టేబుల్ చెంపమీద కొట్టింది. తాను తన అసలు పేరు, గుర్తింపు ధ్రువపత్రాలు కూడా హోటల్లో ఇచ్చానని, అలాంటప్పుడు వాళ్లు తమను వ్యభిచారిణులుగా ఎందుకు చిత్రీకరించాలని ఆమె ప్రశ్నించింది. ముంబైలోని పలు హోటళ్లు, లాడ్జిలు, రిసార్టులు, రెండు స్టార్ హోటళ్లలో ఈ రైడ్లు జరిగాయి. పోలీసులు తమను అందరిముందు అవమానించారని, బలవంతంగా తమతో తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయించారని మరొకరు చెప్పారు.