పబ్స్‌పై డ్రగ్స్ పడగ
Pudding And Mink Pub Raid, సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: గంజాయి నుంచి కొకైన్ దాకా.. రోడ్లపైనే డ్రగ్స్ అమ్మకాలు.. గోవాల్లో పార్టీలు.. యూట్యూబ్‌లో చూసి తయారుచేసి విక్రయాలు.. మితిమీరి వాడిన యువకుడు చనిపోవడం.. ఇలా కొద్దిరోజులుగా మాదకద్రవ్యాల వ్యవహారం ఆందోళన రేపుతుంటే.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటినా యువతీ యువకులు ‘మత్తు’లో చిందేస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, అక్కడ పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని బంజా రాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు.
వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు.
24 గంటల లిక్కర్ అనుమతి పేరిట..
ర్యాడిసన్ బ్లూప్లాజా స్టార్ హోటల్ కావడంతో దానిలోని బార్ అండ్ రెస్టారెంట్‌కు 24 గంటలూ మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు గత నెల 16న కాసిబట్ట అశోక్ పేరుతో రెన్యువల్ అనుమతి పత్రం జారీ చేశారు. ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వీఐపీలు, ప్రముఖులు, వారి సంతానం ఈ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్ నిర్వాహకులు.. అందులోని పబ్‌ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు, ఎక్సైజ్ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే.. తమకు 24 గంటలు లిక్కర్ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్‌లో ఈ దందా నడుస్తోంది. మెంబర్షిప్ ద్వారా వచ్చే యాక్సెస్ కార్డుతో మాత్రమే పబ్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటారు. దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు, వారి పిల్లలు ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌ను వారాంతాల్లో రేవ్ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు.
కోడ్ చెప్పిన వారికే ఎంట్రీ..
ఈ పబ్‌లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు, మూడు రోజుల ముందే ‘వీఐపీ సర్కిల్’కు సమాచారం వెళ్లింది. పబ్‌కు సంబంధించిన ప్రత్యేక యాప్ ద్వారా, ఎంపిక చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా.. ఓ బర్త్‌డే పార్టీ పేరిట ‘డ్రగ్ ఈవెంట్’ నిర్వాహకులు ‘కస్టమర్ల’కు ఆహ్వానం పంపారు, వారికి ప్రత్యేకంగా కోడ్‌వర్డ్స్ ఇచ్చారు. ఆ కోడ్ చెప్పినవారిని మాదకద్రవ్యాలతో వచ్చినా తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎల్ఎస్డీ, కొకైన్, గంజాయి పెద్ద ఎత్తున పబ్‌లోకి చేరింది. రాత్రి 9 గంటలకు మొదలైన హడావుడి అర్ధరాత్రి 12 గంటలకు జోరందుకుంది.
అప్పటికే హోటల్లో బసచేసిన కొందరు బడాబాబులు పబ్‌లోకి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. రేవ్ పార్టీ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. నార్త్, సెంట్రల్, వెస్ట్‌జోన్‌లకు చెందిన టాస్క్‌ఫోర్స్ బృందాలు.. దాదాపు 40 మంది సివిల్ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్‌పై దాడి చేశాయి.
ఎక్కడిక్కడ డ్రగ్స్‌ను విసిరేసి..
పబ్‌లో పోలీసులు ప్రవేశించగానే.. నిర్వాహకులు, డ్రగ్స్ వాడుతున్నవారు అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను పూలకుండీల్లో, స్ట్రాలు ఉంచే డబ్బాల్లో దాచేశారు. కొందరు బాత్రూమ్ల్లో పడేశారు. కిటికీల్లోంచి కొకైన్ షాట్స్, ఎల్ఎస్డీ బోల్ట్స్‌ను బయటికి విసిరేశారు. పోలీసులు ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లా సిద్ధార్థ్, రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల సహా మొత్తం 148 మందిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పబ్ లీజుకు తీసుకొని నడిపిస్తున్న అభిషేక్ ఉప్పాల (39)తోపాటు మేనేజర్ మాదారం అనిల్‌కుమార్ (35)ను అరెస్టు చేశారు.
ఈ పార్టీ నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్‌గా ఉన్న కునాల్, డీజే శశిధర్రావులు రేవ్‌పార్టీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సొంత పూచీకత్తు ఆదివారం ఉదయం విడుదల చేశారు. కాగా.. దాడి సందర్భంగా క్లూస్‌టీమ్‌లు పబ్‌లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపి విశ్లేషించనున్నారు.
కోడ్‌వర్డ్స్‌తో సరఫరా..
పబ్‌లో జరిగిన పార్టీలో యువతీయువకులు కోడ్‌వర్డ్స్‌తో డ్రగ్స్‌ను పిలుచుకున్నట్టు పోలీసువర్గాలు గుర్తించాయి. మేనేజర్ అనిల్‌కుమార్ స్ట్రాలు ఉంచే డబ్బాల్లో కొకైన్ పెట్టి.. వినియోగదారులకు అందజేశాడని తెలిసింది. పోలీసులు దాడి చేసినప్పుడు అదేమిటని అడిగితే.. మాక్టైల్లో కలిపే షుగర్ అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సమాచారం.
డ్రగ్స్ తీసుకున్నది ఎవరెవరు?
ఇటీవల డ్రగ్స్‌పై పోలీసుల నిఘా పెరగడంతో.. ఫుడింగ్ అండ్ మిక్ పబ్ డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలకు సేఫ్‌జోన్‌గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తరచూ డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తేల్చేందుకు పబ్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని నిర్ణయించారు. ఆదివారం తెల్లవారుజామున దాడి సందర్భంగా సీసీ ఫుటేజీ ఉన్న డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోల ఆధారంగా డ్రగ్స్‌ను ఎవరెవరు తీసుకొచ్చారు. ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? సరఫరా చేసింది ఎవరన్నది తేలిపోతుందని పోలీసులు చెప్తున్నారు.
సీఐ సస్పెండ్.. ఏసీపీకి మెమో
ఫుడింగ్ అండ్ మింక్ పబ్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా? లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు తక్షణ చర్య కింద బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు అప్పగించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు.
నిహారికకు సంబంధం లేదు: నాగబాబు
సాక్షి, హైదరాబాద్: పబ్‌లో డ్రగ్స్ కేసుతో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘గత రాత్రి రాడిసన్ అండ్ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ వేళల పరిమితికి మించి నడపడం వల్ల పబ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు అంతా క్లియర్.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’.. అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.
అనుమానితుల శాంపిల్స్ ఫోరెన్సిక్‌కు..!
► డ్రగ్స్ ఎవరెవరు వాడారనేది తేల్చడంపై పోలీసుల దృష్టి
పబ్‌లో నిర్వాహకులు సహా మొత్తం 148 మంది పోలీసులకు చిక్కారు. పబ్ లోపల, బయట ప్రాంగణంలో తప్ప ఎవరి వద్దా నేరుగా డ్రగ్స్ లభించలేదు. సాధారణంగా మాదకద్రవ్యాల కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. దాని ప్రకారం డ్రగ్స్ కలిగి ఉన్న వారిని మాత్రమే అప్పటికప్పుడు అరెస్టు చేయవచ్చు. పబ్‌లో డ్రగ్స్ దొరికినా వాటిని ఎవరు వాడారన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే పబ్‌లో పట్టుబడినవారి నుంచి రక్తం, వెంట్రుకలు, ఇతర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కోర్టు అనుమతి అవసరంకావడంతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు.
ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించింది
సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ‘హెచ్–న్యూ’విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానితో పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టి, కొన్నిసార్లు డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో దాడి చేసి, 148 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఐదు ప్యాకెట్ల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఈ పబ్ వాళ్లు తమకు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహించే అనుమతి ఉందంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. విచారణ చేసి ఎవరెవరు డ్రగ్స్ వాడారో తేలుస్తాం. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి విచారిస్తాం.
– జోయల్ డెవిస్, వెస్ట్‌జోన్ డీసీపీ
పోలీసులే కస్టమర్లలా మారి..
ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్, రేవ్ పార్టీలు చాలాకాలంగా సాగుతున్నట్టు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో నిఘా పెట్టారు. ఈ పబ్ సభ్యత్వం కోసం ఏడాదికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పామ్ (ఫుడింగ్ అండ్ మింక్) పేరుతో ఓ యాప్ నిర్వహిస్తున్నారు. పార్టీలకు రావాలని భావించే వారంతా దాన్ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. పబ్‌లోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. పబ్ వ్యవహారం ఇంత పకడ్బందీగా సాగుతుండటంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది.
దీనిని ఛేదించడానికి పది రోజుల కింద పక్కాగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. శనివారం రాత్రి యాప్, ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్‌లోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో డ్రగ్స్ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే కాపుకాసిన ప్రత్యేక బృందాలు పబ్‌పై దాడి చేసి.. రేవ్ పార్టీ గుట్టురట్టుచేశారు.